కెరీర్ బిగినింగ్ నుంచీ ప్రయోగాలతోనే ప్రయాణిస్తున్నాడు తమిళ హీరో సూర్య . ఆ క్రమంలో పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయినా సరే.. తాను నమ్ముకొన్న సిద్ధాంతాన్ని పక్కాగా ఫాలో అవుతున్నాడు. రొటీన్ మాస్ సినిమాల్ని పక్కనపెట్టి.. న్యూజెన్ ప్రేక్షకులకు కావల్సింది ఇవ్వడంలో ముందుంటున్నాడు. గత నాలుగైదు ఏళ్ళ నుంచి సూర్యకి సరైన హిట్టు రావడం లేదు. అందుకే ఇప్పుడో గన్ షాట్ హిట్టు కోసం ట్రై చేస్తున్నాడు. సినిమా పేరు ‘సూరారై పోట్రు’. ‘గురు’ సినిమాతో సౌత్ లో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న సుధ కొంగర ఈ సినిమాతో రెండో సారి కూడా విజయం సొంతం చేసుకొనే ప్రయత్నంలో ఉంది.
అయితే హీరో సూర్య.. ఈ మూవీతో ఒక ప్రయోగం కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఓటీటీలోనే విడుదల కానుంది. ఇంతవరకూ ఓటీటీలో చిన్న సినిమాలే విడుదలయ్యాయి. మీడియమ్ రేంజ్ హీరోలే ఓటీటీ విడుదలకు అంగీకరించారు. కానీ ఫస్ట్ టైమ్ ఒక స్టార్ హీరో సినిమా .. థియేటర్స్ లో కాకుండా.. డైరెక్ట్ గా ఇలా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతుండడం ప్రయోగమనే చెప్పాలి. పెద్ద హీరోలనగానే… నిర్మాతలు భారీగా ఖర్చుపెడతారు. అలాంటి సినిమాల్ని థియేటర్స్ లో విడుదల చేస్తేనే .. పెట్టుబడికి తగిన విధంగా లాభాలు వస్తాయి.
అలాంటి సినిమాను ఓటీటిలో విడుదల చేస్తే.. అంత లాభం రాకపోవచ్చు. అయినా సరే సూర్య ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనుండడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీని రిజల్ట్ ను బట్టి.. భవిష్యత్తులో మిగతా పెద్ద హీరోల సినిమాల ఓటీటీ రిలీజెస్ ఆధారపడి ఉన్నాయి. సుధా కొంగర దర్శకత్వ ప్రతిభపై నమ్మకమున్న నిర్మాతలు .. ఈ సినిమా ఓటీటీలో ఒక సరికొత్త విప్లవానికి తెరతీస్తుందని చెబుతున్నారు. అయితే సుధా కొంగరకు ఇది రెండో సినిమా. పైగా కమర్షియల్ సినిమా తీయడం ఇదే మొదటిసారి. అందులోనూ స్టార్ హీరో తో సినిమా చేయడం కూడా ఆమెకు కొత్త.
ఈ పరిస్థితుల్లో సూరారై పోట్రు ఏ స్థాయి విజయం అందుకుంటుంది అనే విషయంలో సందేహాలు లేకపోలేదు. అయితే ఇంతకు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. అందులో సూర్య చేసిన పైలట్ పాత్ర హైలైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడు, మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్ కాబోతోంది. మరి వచ్చేనెల 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ‘సూరారై పోట్రు’, ‘ఆకాశం నీ హద్దురా’ తెలుగు వెర్షన్ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాయో .. దీని స్ఫూర్తితో ఇంకా ఏమేం పెద్ద సినిమాలు విడుదలవుతాయో చూడాలి.











