కొడాలి నాని పై ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఒక రేంజిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి సూటిగా తగిలే లాగా ‘క్రిస్టియన్ ముఖ్యమంత్రి’ అని వ్యాఖ్యానించడం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రధానంగా కొడాలి నాని ఆదివారం సాయంత్రం టీవీ చానెళ్లతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన రఘురామక్రిష్ణ రాజు, నాని మాటల వెనుక జగన్ ఉన్నారన్నట్లుగా ముడిపెడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
విగ్రహాలు విరిగిపోతే ఏంటి అని అంటున్నారు.. కొడాలి నాని వెనుక ఉన్న శక్తి ఎవరు..? విగ్రహాలు విరిగిపోతే దేవుడికి ఏమి కాదు… కాని భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. దేవాలయాలపై దాడులు హిందువులకు తగలిన గాయాలు అని ఆయన అభివర్ణించారు.
హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలిగేలా కెబినెట్ మంత్రులు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించడం మంచిది కాదని ఆయన అనడం వివాదాస్పదంగా మారుతోంది. కొడాలి నాని వ్యాఖ్యలు సరైనవి కావు. అమ్మవారి రథం నుంచి సింహాలు చోరీకి గురైతే ‘పోయింది వెండే కదా’ అనడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.
కొడాలి నాని క్రిస్టియన్ ముఖ్యమంత్రి దారిలో పడిపోయారని రఘురామక్రిష్ణ రాజు అన్నారు. కొడాలి నాని వెనుక ఉన్న శక్తికి దండం పెడుతున్నాను… హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దు. వెంకటేశ్వర స్వామి డబ్బు పై కన్ను వేశారు అని అందరూ అనుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించిన రఘురామక్రిష్ణం రాజు ఆ మాటల ద్వారా ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారో అందరికీ అర్థమైపోయేలాగానే ఉంది.
రథం తగలబెడితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు ఆయన జేబులో నుంచి కాదు కదా.. ప్రజల డబ్బులే కదా.. అంటూ రఘురామక్రిష్ణ రాజు వ్యాఖ్యానించారు. మా మతం జోలికి రాకండి మా మతాన్ని కాపాడే వారు ఉన్నారు..హిందూవులు అన్నీ చూస్తున్నారు. దేవుడి సొమ్ము కొట్టేసినవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు అని వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడో ఉండాలి అని తాను అనుకున్నానని కానీ ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారని అన్నారు. హిందువుల మనోభావాలను పార్టీలకు అతీతంగా కాపాడాలన్నారు. దేవుళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం పై ఉందంటూ.. హిందువుల మనోభావాలు కాపాడడానికి .అందరూ ప్రమాణం చేయాలని రఘురామక్రిష్ణ రాజు పిలుపు ఇచ్చారు.










