ఒక్క ప్లాప్ ఇచ్చినంత మాత్రానా .. దర్శకుడి టాలెంట్ ను తక్కువ చేయకూడదు. ఈ ప్రిన్స్ పుల్ ను కొందరు హీరోలు బాగానే ఫాలో అవుతారు. అలాంటి వారిలో అక్కినేని నాగచైతన్య ఒకడు. డైరెక్టర్ ఖాతాలో ఒక సూపర్ హిట్టుంటే చాలు.. ఆ తర్వాత అతడు ఎన్ని ప్లాపులు తీసినా చైతూ పట్టించుకోడు. నాగచైతన్య గతంలో పనిచేసిన దర్శకుల లిస్ట్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ్ముడు అఖిల్ కు ఫ్లాపులిచ్చిన ఇద్దరు దర్శకులతో అన్న నాగచైతన్య వరుసగా సినిమాల చేస్తున్నాడు. అఖిల్ ను హీరోగా నిలబెట్టడంలో వారిద్దరూ ఫెయిల్ అయ్యారు. అయినా సరే వారికి మళ్లీ చైతూ అవకాశాలివ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అక్కినేని అఖిల్ తన అన్నలాగానే టాలీవుడ్ లో హీరోగా నిలబడాలనుకున్నాడు. కానీ .. తొలి సినిమా ‘అఖిల్’ తో పెద్ద షాక్ తిన్నాడు. దాంతో అతడి రెండో సినిమా ప్రెస్టేజియస్ గా మారింది. అందుకే అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’తో మెమరబుల్ హిట్టిచ్చిన విక్రమ్ కె కుమార్ ను రంగంలోకి దింపారు నాగార్జున. మనం తర్వాత విక్రమ్ తీసిన ‘24, నానీ గ్యాంగ్ లీడర్’ సినిమాలు రెండూ ఫ్లాప్ అయినా సరే.. అతడి టాలెంట్ మీద నమ్మకంతో అఖిల్ తో ‘హలో’ తెరకెక్కించే అవకాశమిచ్చారు. కానీ విక్రమ్.. నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నమోదు అయింది. దాంతో అఖిల్ కెరీర్ కాంప్లికేటెడ్ గా మారింది. మూడో సినిమా ఖచ్చితంగా హిట్టవ్వాలి. దాంతో మెగా హీరో వరుణ్ తేజకి ‘తొలిప్రేమ’ తో సూపర్ హిట్టిచ్చిన వెంకీ అట్లూరి కి మూడో సినిమా ఛాన్సిచ్చారు. కానీ వెంకీ కూడా అక్కినేని వారి నమ్మకాన్ని నిలబెట్టు కోలేకపోయింది. అఖిల్ తో వెంకీ తీసిన ‘మిస్టర్ మజ్ను’ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇంత జరిగినా సరే.. అక్కినేని నాగచైతన్య .. తన తమ్ముడికి పెద్ద ఫ్లాప్స్ ఇచ్చిన విక్రమ్ కుమార్, వెంకీ అట్లూరి తో వరుసగా సినిమాలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నాగార్జున పుట్టిన రోజు నాడు.. నాగచైతన్య కొత్త సినిమా ‘థాంక్యూ’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. దానికి దర్శకుడు విక్రమ్ కుమారే. తమ్ముడికి ప్లాపిచ్చినా సరే.. అతడు చెప్పిన కథ చైతూకి బాగా నచ్చిందట. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళోబోతోంది. ఇక నాగచైతన్య .. అఖిల్ కు ‘మిస్టర్ మజ్ను’ తో ప్లాప్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. లాక్ డౌన్ టైమ్ లో వెంకీ.. ఒక స్పోర్ట్స్ డ్రామా స్ర్కిప్ట్ రాసుకొని .. ఇటీవల చైతూకి వినిపించాడట. ఆ స్టోరీ అతడికి బాగా నచ్చడంతో సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమా తీయడానికి రెడీ అవుతోందట. మరి తమ్ముడు అఖిల్ కు ప్లాపు లిచ్చిన విక్రమ్, వెంకీ నాగచైతన్య కైనా హిట్స్ ఇస్తారో లేదో చూడాలి.











