జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు మరోమారు మొట్టికాయలు వేసింది. ధర్మాసనం ప్రభుత్వాన్ని నడపడం ఇలాగేనా? అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కార్ ను చిక్కులోకి నెట్టింది. 2018లో గుంటూరు-1లోని పోలీసు స్టేషన్ పై ఓ వర్గం వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆ వర్గానికి చెందిన నేతలపై అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందుకు కూడా ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో జగన్ సర్కార్ ప్రాసిక్యూషన్ ను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ పిటీషన్ హైకోర్టులో దాఖలైంది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు
ప్రభుత్వం తీసుకున్న ఉపసంహరణ నిర్ణయంపై హైకోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ ఎత్తేస్తూ విడుదల చేసిన జీవోలో సదరు వర్గ మతాన్ని ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో మత ప్రస్తావన గురించి ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ జీవోను విచారణను ఉపసంహరణ చేసేందుకు విడుదల చేసినట్లు లేదని కోర్ట్ అభిప్రాయపడింది. రాజకీయ లబ్ది కోసం ఈ జీవోను విడుదల చేసినట్లు ఉందని రాష్ట్ర టాప్ కోర్టు వ్యాఖ్యానించింది. ఓట్ల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అర్థమవుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇలాంటివి తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రం అసలు సెక్కులర్ రాష్ట్రమేనా అంటూ ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని కొట్టివేసింది.
ప్రభుత్వ వాదన
విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుపున మహేశ్వర్ రెడ్డి తమ వాదనలను వినిపించారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో ఎఫ్ఐఆర్ కాపీలో మతాన్ని ప్రస్తావించారని అందుకే జీవోలో మతాన్ని ప్రస్తావించామని కోర్టుకు తెలిపారు. ఇలాంటి ప్రస్తావనలు ఇక చేయబోమని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా డీజీపీ, హోంశాఖలకు తెలపాలంటూ కోర్ట్ సూచించింది. తీవ్రమైన కేసులను ఉపసంహరణ చేసుకోరాదని లేకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని పలు దృష్టాంత్యాలు ఉన్నాయి. కానీ జగన్ సర్కార్ ఆ ఉదంతాలను పట్టించుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం..ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగిపోయింది.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 335 ఫిర్యాదులు హైకోర్టులో నమోదయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ పీటీషన్లు దాఖలయ్యాయి. కానీ తీరు మారని జగన్ సర్కార్ విచారణ జరుగుతున్న సమయంలో ప్రాసిక్యూషన్ ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలు అక్షింతలు, మొట్టికాయలు వేస్తున్నా జగన్ ప్రభుత్వం తీరు మారడం లేదని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.











