జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో దాదాపు ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా మళ్లీ నగరవాసులకు చేరువైంది. సుధీర్ఘ విరామం తరువాత హైదరాబాద్ సిటీ బస్సులు శుక్రవారం తెల్లవారు జాము నుంచే రోడ్డెక్కాయి. చాలా రోజుల తరువాత బస్సు సేవలు అందుబాటులోకి రావడంతో జనం వాటిలో ఎక్కేందుకు ఇంట్రస్ట్ చూపించారు. కరోనా నివారణ వ్యాప్తిలో భాగంగా దశల వారీగా ఆర్టిసీ బస్సులు నగరంలో నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు నెలలుగా నిలిచిపోయిన సిటీ సర్వీసులను అన్ని రూట్లలో 25 శాతం నడిపేందుకు ప్రభుత్వం ఆమోదించింది. అయితే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సిటీ బస్సు సేవలు నిలిచిపోవడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రజా రవాణా లేక నానా అవస్థలు పడ్డారు. ఉద్యోగ, వ్యాపార, తదితర పనుల నిమిత్తం బయటికి వెళ్లేందుకు నిన్నటి వరకు ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనాలను, ప్రైవేట్ రవాణాపై నగర జనం ఆధారపడ్డారు. దీన్ని అదునుగా చేసుకొని క్యాబ్, ఆటోలు వారు ఛార్జీల పేరుతో జనం నుంచి అందినకాడికల్లా దండుకున్నారు. సుధీర్ఘమైన విరామం తరువాత నగరంలో మళ్లీ సిటీ బస్సులు పరుగులు పెడ్తుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా రవాణా అందుబాటులో..
లాక్ డౌన్, కరోనా తెచ్చిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు. జనజీవనమంతా అస్తవ్యస్థమైంది. వ్యాపారాలు కుదేలయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రజారవాణా అయిన రైల్వే, ఆర్‌టిసి, మెట్రో సేవలు పూర్తిగా నెలల తరబడి నిలిచిపోయిన విషయం తెలిసిందే. అన్‌లాక్ తరువాత కార్యాలయాలు, వ్యాపార సంస్థలు యథావిధిగా తెరుచుకున్నా మెట్రో సేవలు, ఆర్‌టిసి సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఉద్యోగాలకు, పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర జనం చాలా వరకు ఆర్‌టిసి, మెట్రో, ఎంఎంటిఎస్ సేవలనే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కరోనా నేపథ్యంలో ఈ సేవలు కొన్ని రోజుల వరకు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. కొన్ని రకాల సడలింపులతో కేంద్రం ఈనెల 7న మెట్రో పరుగులకు అనుమతులివ్వడంతో నగరవాసులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరంలో సిటీ బస్సుల రాకపోకలను సాగించడంతో ప్రజలకు ప్రజా రవాణా పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లైంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..
గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 బస్సుల్లో 25 శాతం బస్సులను శుక్రవారం నుంచి నడిపిస్తున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని వైరస్ ప్రబలకుండా ఉండేందుకై మార్చి 22 నుంచి ఇప్పటి వరకు సిటీలో బస్సులను నడపలేదని, అయితే సామాన్య ప్రజల రవాణా ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. గతంలో సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు, హైదరాబాద్ రీజియన్ లో సుమారు 1700 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి అన్నారు. ప్రస్తుతం 25 శాతం బస్సులను ప్రధానమైన మార్గాల్లో ఆర్‌టిసి నడుపుతోంది. బస్సుల్లో కోవిడ్ నిబంధనలు పాటించి బస్సులను నడిపేలా అధికారులు ముందస్తు చర్యలు అన్నీ తీసుకున్నారు. అలాగే, కర్నాటక, మహరాష్ట్రకు నడిపే సర్వీసులను కూడా పునరుద్దరిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కానీ ఏపీ బస్సులపై ఇంకా క్లారిటీ రాలేదు.











