కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
అశోక్ బాబు అరెస్టు చేయటంపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిసన్ విచారణ జగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అశోక్ బాబు తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ణ్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తరుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. నిన్న గురువారం రాత్రి అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపి కి నోటీసు అందించారు సిఐడీ అధికారులు.
అరెస్ట్ కు దారి తీసిన అంశాలు..
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించింది. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే క్రమంలో నకిలీ విద్యార్హతలతో ధ్రువపత్రాలను సమర్పించారని ఆరోపిస్తూ.. విజయవాడకు చెందిన మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకుని, సమగ్ర దర్యాప్తుకు సీఐడీకి ఫిర్యాదు చేయాలని వాణిజ్య పన్నుల విభాన్ని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ సయుక్తం కమిషనర్ గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసినట్లు చెబుతున్నా.. తెలుగుదేశం పార్టీ మాత్రం కావాలనే అశోక్ బాబును వేదిస్తున్నారని, ఒకసారి క్లోజ్ అయిన కేసును తిరగతోడటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని మండిపడుతున్నారు. సర్వీసు మేటర్స్ లో తప్పుడు కేసులో ఇరికించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందునే ఆయనపై కక్ష సాధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇది కోర్టులో నిలబడే కేసు కాదని, అక్కడే పోరాడి తేల్చుకుంటామని తేదేపా బలంగా వాదిస్తోంది!











