రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ.5 లక్షల అప్పు భారం
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పై శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు బాబు విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి నిత్యం సొంత లాభం తప్ప.. ప్రజాక్షేమం పట్టదని మండిపడ్డారు. రాష్ట్రంలో గడిచిన 32 నెలల వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు ఘననీయంగా దిగజారిపోయాయని విమర్శించారు. జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆటకట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసి.. రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని, రెండునరేళ్లుగా జగన్ చేస్తున్న అప్పులు రాష్ట్ర ప్రజలకు పెనుభారంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వీటన్నీంటిని ప్రశ్నించే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ లతో జరుగుతున్న అవినీతిని ఎంతోకాలం కప్పిపెట్టలేరని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాలకు అక్కరకురాని సహజ వనరులు
రాష్ట్రంలో సహజ వనరులు ప్రజలకు ఏ మాత్రం అక్కరకు రావాడంలేదని చంద్రబాబు మండిపడ్డారు. స్వప్రయోజనాలకు సహజ వనరులను వాడుతున్నారన్నారు. ఏపీకి జగనే చివరి సీఎం అన్నట్లు రాష్ట్రంలో ఉన్న ఆస్తులను అమ్ముతున్నారని ఆయన దుయ్యబట్టారు. చివరికి చెత్తమీద కూడా పన్నువేసే స్థాయికి ఆదాయాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిత్యావసరాలు, గ్యాస్, లిక్కర్ ధరలు ఏపీలోనే ఎక్కువ అని తెలిపారు. వైసీపీ నేతలు కోటేశ్వరులవుతుంటే.. పేదలు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారని ఆయన వివరించారు. దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.