గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి.హైదరాబాద్ నగరంలో గత ఐదురోజులుగా వరదనీరు ప్రజలను ఇబ్బంది పెడుతుంది. వరద నీటిలో రోజులు వెళ్ళదీస్తున్న ప్రజలు ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. తమ కాలనీల్లో కురిసిన వర్షాలతో కాకుండా ఎక్కడో కురిసిన వర్షాలకు మేమెందుకు ఇబ్బందులు పడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పై చెరువుల పరిధిలో ఉన్న కాలనీలు మునగ కుండా ఉండేందుకు కట్టలకు గండు కొడుతుండటంతో చెరువుల కింద ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి నీళ్లు తమ ఇళ్లలోకి వస్తుండటంతో నీటి ప్రవాహం తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అధికారులు , పాలక మండల్లు తమ బాధలను పట్టించుకోక పోవడంతో కాలనీ వాసులే స్వయంగా రంగంలోకి దిగి వరద నీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.
వరద నీటితో నగర శివారు ప్రాంతాలతో పోల్చితే వాటికి అనుకుని ఉన్న కాలనీలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డాయి. నాదర్ గూల్, బడంగ్ పేట్ వంటి ప్రాంతాల నుండి భారీగా వర్షపు నీరు కింద ఉన్న చెరువుల్లోకి పోటెత్తింది. దీంతో మీర్పేట్ లోని పెద్ద చెరువులోకి నీరు భారీగా చేరుకోవడంతో కింద ఉన్న కాలనీల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది. ఇదంతా బడంగ్ పేట్ నుండి వచ్చే వరద నీరే నంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కింద ఉన్న కాలనీ వాసులు. దీంతో పెద్ద చెరువు నుండి నీరు బయటకు వచ్చే చోట రోడ్డు పూర్తిగా పాడై పోవడమే కాకుండా మురుగు నీటీతో కాలనీల్లో నివసించలేని పరిస్థితి నెలకొంది. దీంతో మీర్పేట్ కార్పోరేషన్ పరిధిలో ఉండే కాలనీ వాసులు నీరు దిగువకు రాకుండా కట్టవేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితిని గమనించిన బడంగ్ పేట్ కాలనీ వాసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వరద నీటిని ఎలా ఆపుతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ఇరు కార్పోరేషన్ లలో కాలనీ ప్రజల మధ్య ఘర్షణ పూరిత వాతారణం నెలకొంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.
అయితే ఇప్పుడు సర్ది చెబితే గొడవలు ఆగిపోతాయా అంటే చెప్పలేని పరిస్థితి. అనుకోకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల మధ్య చిచ్చురేగింది. ఇందుకు కారకులు ఎవరు . వరద నీరు సాఫీగా పల్లానికి పారకుండా అడ్డు పడ్డది ఎవరు అన్న ప్రశ్నలు సమాధానం లేనివి. చెరువులోకి వచ్చిన నీరు కింది పోవడం సహజమే. అయితే పాలకులు సరైన రీతిలో వాటిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేయక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వర్షాలు కురిసిన సమయంలో భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని చెప్పే పాలకులు యేటా ఆవే మాటలు రిపీట్ చేస్తున్నారు. దీంతో వరదనీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాలనీల మధ్య పంచాయితీలు పెరిగితే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియదు.. ఇప్పటికైనా పాలకులు వరద నీరు సాఫీగా బయటకు వెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుని ప్రజల మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలంటున్నారు.











