హైదరాబాద్ ఎక్కడ.. ఢిల్లీ ఎక్కడ.. రెండు ఉన్నది ఒక దేశంలోనైనా.. ఇదేమో దక్షిణాన ఉంటే అదేమో ఉత్తరాన ఉంది. అక్కడి చేరుకోవాలంటే విమానం లేదా ట్రైన్ అయితే కాస్త బెటర్. ఇంకా ఎందులోనైనా వెళ్లచ్చు అంటే బస్ లేదా కార్. మరి సైకిల్‌లో వెళితే ఎలా ఉంటుంది. సైకిల్ సరదా ఏమో కానీ.. అక్కడికి చేరుకునే సరికి పై ప్రాణాలు పైనే పోవడం ఖాయం. కానీ, అలాంటి సుసాధ్యమైన పనిని సాధ్యం చేసి చూపించాడీ హైదరాబాదీ ఆనంద్ గౌడ్.

మన హైదరాబాదీ
హైదరాబాద్ అల్వాల్‌లోని వెంకటాపురానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, సాధారణంగా అలా చేయాలనుకుంటే వింతేముంది. దాదాపు 1500 వందల కిలోమీటర్లను కేవలం 7 రోజుల్లో.. అదీ సైకిల్ పైన చేరుకుని చరిత్ర సృష్టించాడు ఆనంద్. ఈ నెల 17వ తేదీన సైకిల్ యాత్రను మొదలుపెట్టిన ఆనంద్.. ఆ యాత్రను 23 వ తేదీన పూర్తిచేశాడు. అందుకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. రోజుకు 240 కిలోమీటర్ల చొప్పున 240 కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. 7 రోజుల్లో 1500 కిలోమీటర్లు పూర్తి చేసి చరిత్రకెక్కాడు.
ఒలంపిక్స్ లక్ష్యం
ఇంతటి ఘనత సాధించిన అతనికి స్థానికులు ఘనంగా స్వాగతించారు. ఇంతటి లక్ష్యాన్ని సాధించిన ఈ తెలుగు తేజం ప్రభుత్వం సహాయమందించాలని కోరుతున్నాడు. ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించే ప్రోత్సాహం అందిస్తే దేశ ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించేలా కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. అవకాశం లభిస్తే ఒలంపిక్స్‌లో దేశం తరపున ప్రాతినిత్యం వహించి విజయం సాధించి దేశం గర్వించేలా ఎదగాలనేది తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.











