(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో దూకుడు ప్రదర్శించే తెలుగుదేశం పార్టీ నాయకుడు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు నాలుగు రోజులుగా సత్య ప్రమాణాల ఎపిసోడ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న వెలగపూడిని నేరుగా ఎదుర్కొనలేక, అడ్డదారుల్లో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన గత చరిత్రను తవ్వి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హవా కొనసాగిన సమయంలోనూ ఇక్కడ విజయం సాధించి… తనకున్న పట్టు ఏంటో చాటి చెప్పారు. ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా ఉన్న అధికార పార్టీ నాయకుడు వంశీ కృష్ణ యాదవ్ రెండు సార్లు ఆయనపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో విజయనిర్మల కూడా వెలగపూడిపై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. గత 15 ఏళ్లుగా నియోజకవర్గంలో వెలగపూడికి ఎదురు లేకుండా పోవడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అధికార పార్టీ నేతలు… వెలగపూడి సవాల్‌ను రాజకీయం చేస్తున్నారని ,ఇంతకుమించిన నీచ రాజకీయాలు ఉండవని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఆయనకు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
తరచూ ఇంటి ముట్టడి..
ఎన్నికల క్షేత్రంలో నేరుగా ఎదుర్కొనలేక తరచూ ఆయన ఇంటి ముట్టడి కార్యక్రమాలు చేపట్టడంలో విజయనిర్మల ముందుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను విమర్శించారని ఆరోపిస్తూ విజయనిర్మల వర్గం గతంలో రెండుసార్లు ఆయన నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ రెండు ప్రయత్నాలను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఇటీవల 3 రాజధానుల నిర్ణయానికి వెలగపూడి మద్దతు తెలపక పోవడంతో, ఆయన్ను ఉత్తరాంధ్ర ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విశాఖలో గెలిచి, విశాఖలో ఉంటూ విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయనకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే మరోమారు ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడి కార్యక్రమాలు నిరసనలో భాగంగా చేపడుతూ ఉంటారు. ఏడాది మొత్తం కమ్యూనిస్టులు ఇటువంటి కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటారు. కానీ విశాఖలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతల ఇళ్లను ముట్టడించిన సందర్భాలు మరెక్కడా కనిపించవని ప్రతి పక్షాలు అంటున్నాయి.
నయానో భయానో..
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత నగరంలో కీలక నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నాయకులు లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ను తమ వైపునకు తిప్పు కోగా, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎప్పటికైనా ఆ పార్టీలో చేరిక తప్పదన్నట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గంటా వెనుక నడిచే అవకాశం లేకపోలేదు. ఇక మిగిలిన ఏకైక మొండిఘటం… వెలగపూడి రామకృష్ణబాబు. ఆయన్ను అధికార పార్టీలోకి లాగేందుకు మంత్రుల ద్వారా లాబీయింగ్ చేసినప్పటికీ అది సఫలం కాకపోవడంతో… ప్లాన్ B ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందని వెలగపూడి అనుచరవర్గం విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులపై దాడులు చేయడం, నగరంలోని అధికార పార్టీ నేతలంతా మూకుమ్మడిగా విమర్శలు చేయడం, ఆయన గత చరిత్రపై విమర్శలు చేయడం, ఆయన ఇంటి ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం… లాంటి కార్యక్రమాల ద్వారా ఆయన స్వయంగా తెలుగుదేశం పార్టీని వీడేలా సైకలాజికల్‌గా ఒత్తిడి తెస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ ఒత్తిడులను వెలగపూడి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే