(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తమ ఉన్నతిని కోరుకునేవారు.. విమర్శలనే ప్రశంసలుగా భావిస్తారు. తమలోని లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగిపోతారు. ఇందుకు పూర్తిగా విరుద్ధం రాష్ట్ర ప్రభుత్వం తీరు. తాజాగా విద్యాశాఖలో జారీ అయిన ఓ మెమో ఇటు ఉపాధ్యాయ సంఘాలలోనూ అటు మీడియాలోనూ చర్చకు దారి తీసింది.
టీచర్ల బదిలీలు, సిఫార్సు బదిలీలపై పత్రికల్లో కథనాలు వస్తే వెంటనే ఖండించాలని, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తాజాగా ఓ మెమో జారీ చేశారు.
అసలు కారణం ఏమిటంటే?
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో) ఉపాధ్యాయుల బదిలీలు, సిఫార్సు బదిలీలపై గత మాసంలో అనేక ఆందోళనలు చేసింది. సిఫార్సు బదిలీల్లో కేటగిరి 1,2 లకు మాత్రమే చేయడం ఎంతవరకు సమంజసమని నాయకులు ప్రశ్నించారు. అదేవిధంగా జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను బ్లాక్ చేసి చూపుతున్నారని విమర్శించారు. ఈ మేరకు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టి జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. దీంతో విద్యాశాఖ ఘాటుగా స్పందించి,
విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు నిరాధార ఆరోపణలు చేయడం, భాష వినియోగం సక్రమంగా లేకపోవడం సరికాదని పరోక్షంగా హెచ్చరించారు.
దీనికి ఉపాధ్యాయ సంఘాలు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాయి. సిఫార్సు బదిలీలు చేయలేదా? ఖాళీలను బ్లాక్ చేయలేదా? నిరూపించ మంటారా అంటూ ప్రశ్నించాయి.
దానికి సమాధానంగా విద్యాశాఖ… ప్రభుత్వానికి ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా పేదలు, గిరిజన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఖాళీలను బ్లాక్ చేసినట్టు అంగీకరించింది. ఆ సంఖ్య 13 శాతానికి పైగా ఉందని ఉపాధ్యాయ సంఘాల ఆరోపణ.
ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు…
సంఘాల ద్వారా పత్రికలకు ఎక్కుతున్న ఈ సమాచారాన్ని కట్టడి చేసేందుకు విద్యాశాఖ ఈ ఎత్తుగడను పాటిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల్ పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, రీఅపాయింట్మెంట్ వ్యవహారాలకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటే అది ఉపాధ్యాయుల లీకేజ్ అన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. పత్రికల పై చర్యలు తీసుకోండి? వ్యతిరేక కథనాలు ఖండించండి… అని చెబుతూనే… ఉపాధ్యాయ సంఘాల పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మీరు అదుపులో ఉండకపోతే చర్యలు తప్పవని అని చెబుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా, రాజకీయ పైరవీలకు తలొగ్గి సిఫార్సు బదిలీలు చేయవచ్చు కానీ… వాటిని ఉపాధ్యాయ సంఘాలు గాని పత్రికల కానీ ప్రశ్నించకూడదు. ఇదెక్కడి న్యాయమో మెమో జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ కే తెలియాలి.
పత్రికా స్వేచ్ఛను హరించేలా కథనాలు రాయకూడదు అంటూ చెప్పడం నిరంకుశ పాలనకు నిదర్శనం.
Must Read ;- అర్హత లేకున్నా అందలం.. ఆమె స్పెషాలిటీ ఏంటి?
విద్యాశాఖ అధికారులు జారీచేసిన జీవో