సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి అన్నీ నార్మల్ గా ఉండటంతో ఈరోజు 3 గంటలకు డిశ్చార్జ్ చేశారు. రజినీ అభిమానులకు ఒక విధంగా ఇది శుభవార్తే. ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఆ యూనిట్ లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత రజినీ హైబీపీతో బాధపడటంతో డిసెంబరు 25న అపోలోకు తరలించారు.
ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. కాకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గించాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆయన సరాసరి బేగంపేట విమానాశ్రమానికి వెళ్లి ప్రత్యేక విమానంలో రజినీ చెన్నైకి వెళుతున్నారు. కారులో ఆయనతోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాకపోతే వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఆ ప్రకారం చూస్తే ఆయన ఇంటికే పరిమితం కావలసి ఉంటుంది. కాకపోతే మీడియా ముఖంగా ఆయన జనం ముందుకు వచ్చి తన అభిమానులకు సందేశం ఇచ్చే అవకాశం ఉంది.











