అనుకోని లాక్ డౌన్.. భారతదేశంలో ప్రకంపనలు సృష్టించింది. అందరి జీవితాల్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. పనిలేదు.. ఇంటికి చేరే దారిలేదు.. తిండి దొరికే మార్గం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునే దిక్కు కూడా కనిపించక అల్లాడిపోయారు. కొందరు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణాలు సాగించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వారి బాధలకు చలించిన కొందరి హృదయాలు వారిని ఆదరించారు. వారిలో మనమెంగానో పొగుడుతున్న ‘సోనూ సూద్’ కూడా ఉన్నారు. అలాంటి ఓ ప్రయత్నమే ఈ హైదరాబాదీ కూడా చేశాడు. ఆకలన్న వారికి ఆకలి తీర్చాడు.. నగరంలో బ్రతకడానికి అవసరమైతే డబ్బు సాయం కూడా అందించాడు. అతని సాయం లాక్ డౌన్‌తో ముగింసిందనుకుంటే పొరపాటే.. లాక్ డౌన్ ముగిసినా దాని ప్రభావం వల్ల రోడ్డున పడ్డ ఎందరినో నేటి ఆదరిస్తున్నారీ ‘దోసపాటి రాము’.
ఆలోచన రేకెత్తించిన చిన్న సంఘటన
లాక్ డౌన్ మొదలవగానే అందరిలాగే రాము కూడా ఇల్లు కదలకుండా ఉండిపోయాడు. కానీ, కనీస అవసరాల కోసం కాలు బయటపెట్టక తప్పదు కదా.. చాలారోజుల తర్వాత చికెన్ కొంటున్న సమయంలో ఓ మహిళ 2000 పెట్టి చికెన్ కొనడం గమనించి ఆమెను అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం అతనిని సిగ్గుపడేలా చేసింది. వలస కార్మకుల ఆకలి తీర్చడానికి ఆహారం తయారుచేస్తున్నానని చెప్పింది. 2000 పెట్టి చికెన్ కొంటున్న ఆమె జీతం కేవలం 6000 రూపాయలు. రాము జీతం లక్షపైమాటే. వెంటనే వలస కార్మికుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.

మొదటగా 148 వలస కార్మికులకు కావాల్సిన సరుకులను జూన్ వరకు ఫ్రీ అందించే విధంగా ఒక కిరాణ షాపుతో మాట్లాడి ఏర్పాటు చేశాడు. వాళ్లకి సంబంధించిన బిల్లులు తను కట్టే విధంగా మాట్లాడుకున్నాడు. అంతేకాదు.. స్వయంగా వండి వలస కార్మికులకు భోజనం అందించడం ప్రారంభించారు. అలా మొదలైన ఆ కార్యక్రమం అప్రతిహతంగా నేటికీ కొనసాగిస్తున్నారు రాము.
Must Read ;- లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఐఫోన్ల తయారీ ఫ్లాంట్‌పై ఉద్యోగుల దాడి
లాక్ డౌన్ ముగిసిన కొనసాగింపు ఎందుకు?
లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా కొందరు సాయం అందించమని తనని అడుగుతుండడంతో దానికో పరిష్కారం ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. తన ఉంటున్న అపార్టుమెంట్ దగ్గరలోని చెట్టు దగ్గర బియ్యం మూటలను పెట్టి ‘ఎటీఎమ్ – ఎనీ టైం మీల్’కు అంకురార్పణ చేశారు. ఇందులో పనిచేయడానికి వాలంటీర్లు కూడా ముందుకొచ్చారు. లాక్ డౌన్ ముగిసినా కొన్ని రాష్ట్రాలు ప్రజలను అనుమతించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందించారు రాము. ఇలా వలస కార్మికలు కాకుండా.. బండి కదలక, పని దొరక్క బతుకు బండిని నడపలేక ఇబ్బందిపడుతున్న ఎందరికో ఈ ఏటీఎమ్ ఆకలి తీర్చింది.
టీచర్ల పరిస్థితి దయనీయం..
ఎందరో విద్యార్థుల భవిషత్తు తీర్చిదిద్దే టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. నెలల తరబడి జీతాలు లేక కాస్తో కూస్తో ఉన్న చేర్చుకున్న సొమ్ములు లాక్ డౌన్ సమయంలో అయిపోయాయి. ఇకపై ఏం చేయాలో తెలియక కొందరు రోడ్డు పక్కన చిన్న బండ్లు పెట్టుకోవడం లాంటివి కూడా చేశారు. కనీసం తినడానికి లేక ఎంతో దూరం నుండి వచ్చి మరీ రాముని బియ్యం కోసం సాయం అడిగిన వారెందరో. బియ్యం తీసుకోవడానికి వస్తే వాళ్లని చూసి, ఇది మీ కోసం కాదు.. పేదల కోసం అంటూ అవమానించన రోజులు కూడా ఉన్నాయి. లాక్ డౌన్ కాలంలో దారుణమైన పరిస్థితిని ఎదుర్కోన్న వారిలో ప్రైవేటు టచర్లు కూడా ఉన్నారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల పది మంది చేయాల్సిన పనిని ఒక్కరితో చేయిస్తుండడంతో వారి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అటువంటి వారిని కూడా గుర్తించి సాయం అందించారు రాము.
Also Read ;- తెలంగాణాలో సోనూ సూద్ కు గుడి.. !
250th Day at RICE ATM :
ఒక్క L.B. నగర్ రైస్ ATM దగ్గరే 250 రోజులు 25,000 వేల కుటుంబాలకు పైగా రోజుకు 100 కుటుంబాలకు అన్నం పెట్టేభాగ్యం కల్పించిన ప్రతి నేస్తానికి కృతజ్ఞతలు 🙏 pic.twitter.com/jtADqSuhKz— Ramu Dosapati (@dsramu) December 19, 2020
250 రోజులుగా రైస్ ఏటీఎమ్..
లాక్ డౌన్ లో వలస కార్మికుల కోసం మొదలైన ఏటీఎమ్.. నేటికీ కొనసాగుతూ కరోనా కారణంగా కుదేలైన కుటుంబాలకు అన్నం పెడుతుంది. అంతేకాదు.. ఈ మధ్య వరదలు సమయంలో కూడా ఎల్బీనగర్‌లో అందరికీ ఆహారం వండి అందించారు. ఇలా లాక్ డౌన్ సందర్భంలో మొదలైన రాము ఏటీఎమ్ కార్యక్రమం 250 రోజులుగా కొనసాగుతుంది. కుటుంబసభ్యులు కూడా సహరించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏం ఆశించకుండానే ఇంత చేస్తున్నాడా అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు రాము. అయినా సరే వెనకడుగు వేయకుండా.. వచ్చిన వారికి లేదనకుండా.. వారి పరిస్థితిని బట్టి సాయం అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు రాము.
ఇలాంటి వ్యక్తులను చూసినపుడే మానవత్వం, సాయం చేసే గుణం కలిగి ఉన్న మనుషులు ఉన్నారనే నమ్మకం కలుగుతుంది. అందరూ అతనంత సాయం చేయనక్కరలేదు.. కనీసం మనకున్నంతలో.. పక్కవాడికి సాయంచేసినా చాలు.. రాము ఎందరికో ఆదర్శం కావాలని.. అతని కథ అందరిలో స్ఫూర్తి నింపాలని కోరుకుందాం.
Also Read ;- అనితరసాధ్యం .. రజనీ మార్గం ( డిసెంబరు 12 జన్మదిన ప్రత్యేకం)










