ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండా బాధ్యతల నుంచి సీఎం పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం భారీగా ఆర్డర్లు పెట్టాయని, జగన్ మాత్రం ఆ పని ఎందుకు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అనేక రాష్ట్రాల్లో 18 సంవత్సరాలు దాటిన వారందకీ టీకాలు వేస్తుంటే ఏపీలో మాత్రం 45 సంవత్సరాలు దాటిన వారికి కూడా టీకాలు వేయలేకపోతున్నారని ఆయన టీడీపీ నేతలతో ఆన్ లైన్ లో నిర్వహించిన సమావేశంలో అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రను చూసి నేర్చుకోండి
మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు కూడా పిలిచిందని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. కంపెనీలకు అడ్వాన్సులు చెల్లించకుండా కేవలం లేఖలు రాస్తే వ్యాక్సిన్లు రావని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కంపెనీలతో మాట్లాడి నేను వ్యాక్సిన్ తెప్పిస్తే సీఎంగా జగన్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ధ కరోనాను ఎదుర్కోవడంలో పెడితే ఏపీకి ఈ దుర్ఘతి పట్టేది కాదన్నారు. తమిళనాడులో సీఎం స్టాలిన్, అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.











