గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ, నరసరావుపేట అధికారపార్టీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2019 సాధారణ ఎన్నికలప్పటి నుంచీ మొదలైన రచ్చ పరాకాష్టకు చేరింది. గత ఎన్నికల్లో రజనీ ఓటమిని కోరుకున్న శక్తులను నరసరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ప్రోత్సహించారనే ఆరోపణల నేపథ్యంలో వారి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే విడదల రజనీ, ఎంపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎంపీ కాలు పెట్టడానికి వీల్లేదని బహిరంగంగానే ప్రకటించింది. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు గత ఏడాది చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎంపీ పర్యటన చేపట్టారు. విషయం తెలసుకున్న శాసనసభ్యురాలు రజనీ, తన వర్గంలో ఎంపీ పర్యటనను అడ్డుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి ఇద్దరు వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య పచ్చగడ్డివేస్తే మండే విధంగా తయారైంది.
కాల్ లిస్ట్ కలకలం
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ, ఆమె పీఏ కాల్ లిస్ట్ ను, నరసరావుపేట ఎంపీ బయటకు లాగడం వైసీపీలో పెద్ద దుమారం రేపింది. ఎంపీ ఆదేశాలమేరకు రజనీ, ఆమె పీఏ కాల్ లిస్టు డేటాను బయటకు తీసిన గురజాల డీఎస్పీ, సీఐలను వీఆర్ కు బదిలీ చేశారు. కాల్ లిస్ట్ డేటాను ఎంపీ బయటకు తీయించారని తెలియగానే ఎమ్మెల్యే రజనీ వైసీపీ పెద్దలను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. వారి ఆదేశాలమేరకే డీజీపీ బాధ్యులైన ఆ ఇద్దరు పోలీసు అధికారులను వీఆర్ కు బదిలీ చేశారని సమాచారం.
ఎమ్మెల్యే అరాచకాలను బయటపెట్టేందుకేనా…
చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. దీనికితోడు పేదలకు సెంటు భూమి వ్యవహారం, అనధికారికంగా పశువుల సంతలు నిర్వహించేవారి నుంచి ఎమ్మెల్యే పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని, దీన్ని వెలికి తీసేందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆమె కాల్ లిస్టు బయటకు తీయించారనేది కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే రజనీ సీరియస్ గా తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో బీసీ కోటా నుంచి మంత్రి పదవి రాకుండా చేసేందుకు ఓ సామాజికవర్గం నేతలు తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగింది
ఎమ్మెల్యే రజనీ కాల్ లిస్టు వ్యవహారంలో జనం మరో రకంగా చర్చించుకుంటున్నారు. రజనీ పీఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి, ఎంపీ వద్ద పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఓ మహిళకు తరచూ ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారం సదరు మహిళ ఎంపీకి చెప్పడం వల్లే ఆయన రహస్యంగా రజనీ పీఏ కాల్ లిస్ట్ డేటా తెప్పించారని తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వ్యవహారం పూర్తిగా చెడిందనే చెప్పవచ్చు.











