ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగి సత్తా చాటుతోంది రాజస్థాన్ రాయల్స్ టీమ్. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ రెండు టీమ్‌ల మధ్య బుధవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
ఈ సీజన్లో రాజస్థాన్ టీమ్ భీకర ఫామ్‌లో ఉంది. పంజాబ్ జట్టుపై ఏకంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అందర్నీ ఆశ్చర్యపరించింది. మరోవైపు కోల్‌కతా తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై సునాయాసంగా గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తమ విజయపరంపరను కొనసాగించాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది. మరోవైపు వరుస విజయాల రాజస్థాన్‌కు చెక్ పెట్టాలని కోల్‌కతా వ్యూహాలు రచిస్తోంది. మరి, ఎవరి లక్ష్యం నెరవేరుతుందో చూడాలి.
రాజస్థాన్ టీమ్ బలాలు
ఈ సీజన్లో రాజస్థాన్ టీమ్ అత్యంత బలంగా ఉంది. తొలి సీజన్‌లోని షేన్ వార్న్ సేనను తలపిస్తోంది. సంజూ శాంసన్, కెప్టెన్ స్మిత్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వీరు అర్థ శతకాలు సాధించారు. రెండో మ్యాచ్‌లో వీరికి రాహుల్ తెవాటియా కూడా జత కలిశాడు. దీంతో భారీ లక్ష్యం కూడా ఈ టీమ్ ముందు చిన్నబోతోంది. ఇక, ఆల్‌రౌండర్ రాహుల్ రాజస్థాన్ జట్టుకు ప్రధాన బలంగా మారాడు. తొలి మ్యాచ్‌లో బంతితో మెరిసిన రాహుల్.. రెండో మ్యాచ్‌లో ఛేజింగ్‌లో అద్భుతమైన అర్ధశతకం సాధించాడు.
బలహీనతలు
ఇటీవలె టీమ్‌తో జాయిన్ అయిన ఓపెనర్ బెయిర్ స్టో ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం స్మిత్ సేనను కలవరపెడుతోంది. అలాగే పరుగులు కట్టడి చేయడంలో రాజస్థాన్ బౌలర్లు విఫలమవుతున్నారు. జొఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, టామ్ కర్రన్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అలాగే మిడిలార్డర్లో రాబిన్ ఉతప్ప వంటి బ్యాట్స్‌మెన్ ఇంకా ఫామ్‌లోకి రాలేదు. టీమ్ పూర్తిగా స్మిత్, సంజూ శాంసన్ మీదే ఆధారపడుతోంది.
రాజస్థాన్ టీమ్ (అంచనా)
స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా, రాబిన్ ఉతప్ప, డేవిడ్ మిల్లర్, జొఫ్రా ఆర్చర్, టామ్ కర్రన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, జయదేవ్ ఉనద్కత్.
కోల్‌కతా బలాలు
తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో పరాజయం పాలైన కోల్‌కతా జట్టు రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని హైదరాబాద్‌ను ఓడించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి రావడం కోల్‌కతా టీమ్‌కు శుభపరిణామం. అలాగే ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ మోర్గాన్ కూడా బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే కోల్‌కతా బౌలింగ్ విభాగం మరింత బలంగా ఉంది.
బలహీనతలు
కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్ ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం టీమ్‌ను నిరాశపరుస్తోంది. అలాగే ఆల్‌రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిరాశపరుస్తున్నారు. వీరు ఇంకా టచ్‌లోకి రాకపోవడం కోల్‌కతా శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక భారీ ధర వెచ్చించి కొనుకున్న ప్యాట్ కమిన్స్ పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
కోల్‌కతా జట్టు (అంచనా)
దినేష్ కార్తీక్, శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, ప్యాట్ కమిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి.
మ్యాచ్ ఫేవరెట్
బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరు జట్లకూ సమాన అవకాశాలున్నాయి. ఈ సీజన్‌లోని బలమైన జట్లలో కోల్‌కతా ఒకటి. ఇక, ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న జట్టు మరొకటి. మరి, ఈ మ్యాచ్‌లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.











