ప్రతి గింజ మీదా తినే వాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు చెబుతారు. అలాగే.. ప్రతీ దర్శకుడి ప్రాజెక్ట్ లో ఏ హీరో నటించాలి అనే విషయాన్ని.. ఆ దేవుడి స్ర్కీన్ ప్లే తో ముందే రాసి ఉంటుందని అనుకోవాలి. 2017లో దర్శకుడు కిశోర్ తిరుమల విక్టరీ వెంకటేశ్ కోసం ఒక కథ రెడీ చేసుకున్నాడు. సినిమాకి ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ కూడా అనుకున్నాడు. వెంకీకి కథ వినిపించాడు. ఆయనకి కూడా కథ బాగా నచ్చింది. అయితే .. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత వరకూ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
రామ్ తో తీసిన ‘నేను శైలజ’ సూపర్ హిట్టయిన ఉత్సాహంతో .. ఆ తర్వాత ప్రాజెక్ట్ గా వెంకీ కోసం ఈ కథ రాసుకున్నాడు కిశోర్. ఆ ప్రాజెక్ట్ అటకెక్కడంతో.. రామ్ తోనే ‘ఉన్నది ఒకటే జిందగి’ తీసి.. ఫ్లాప్ మూటగట్టుకున్నాడు కిశోర్ తిరుమల. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ ‘చిత్రలహరి’తో ఈ దర్శకుడు మళ్లీ ఫామ్ లోకొచ్చాడనుకోండి. ఇప్పుడు రామ్ తోనే ‘రెడ్’ అనే సినిమా తీస్తున్నాడు కిశోర్. తాజాగా కిశోర్ తిరుమల .. అప్పట్లో ఆగిపోయిన ప్రాజెక్ట్ ను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేపుతోంది. అప్పుడు సీనియర్ హీరో అనుకున్న ఆ ప్రాజెక్ట్ ను ఇప్పుడు శర్వానంద్ తో తీయాలనుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నాడు కిశోర్ తిరుమల. ఈ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్ నే దాదాపు ఖాయం చేయబోతున్నాడట. గతంలో కె.బాలచందర్ కృష్ణంరాజు, జయసుధ జంటగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్ తోనే ఒక సినిమా తెరకెక్కించి.. సక్సెస్ సాధించారు. ఇందులో చిరంజీవి కూడా నటించారు. ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా రానుండడం విశేషం. శర్వానంద్ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ మూవీలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కిశోర్ తిరుమల ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతాడట. మరి వెంకీ వదిలేసిన ఈ ప్రాజెక్ట్ శర్వాకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.











