ఈ ఏడాది ఐపీఎల్ పంజాబ్ టీమ్‌కు అస్సలు కలిసి రాలేదు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దానిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్ట సాధ్యం చేసుకుంటోంది. ఈ సీజన్‌లో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇంకా మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కనీసం ఏడు గెలవాలి. ఈ నేపథ్యంలో రాహుల్ సేన శనివారం జరగబోయే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడుతోంది.
మరోవైపు కోల్‌కతా జట్టు వరుస విజయాలతో మంచి జోరుమీదుంది. ముంబైతో పరాజయం తర్వాత గేరు మార్చిన కార్తీక్ సేన సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగబోయే తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో తలపడబోతోంది. అబుదాబిలోని షేక్ జావేద్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తన ఖాతాలో మరో రెండు పాయింట్లను జత చేసుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి విజయాల బాట పట్టాలని పంజాబ్ అనుకుంటోంది. మరి, ఎవరి కోరిక ఫలిస్తుందో చూడాలి.
పంజాబ్ బలాలు
ఈ సీజన్‌లో పంజాబ్ టీమ్ గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా ఓడిపోతోంది. కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అలాగే నికోలస్ పూరన్ గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. కోల్‌కతా మ్యాచ్‌కు క్రిస్ గేల్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. కేఎల్ రాహుల్, మాయంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్, నికోలస్ పూరన్, జోర్డాన్, షమీ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పంజాబ్ టీమ్‌లో ఉన్నారు. వారు ఇకనైనా ఫామ్‌లోకి వస్తే పంజాబ్ కాస్త మెరుగైన స్థితిలో నిలుస్తుంది.
బలహీనతలు
వరుస పరాజయాలు పంజాబ్ టీమ్‌లో నిరాశ నింపుతున్నాయి. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 69 పరుగుల తేడాతో ఓడిపోవడం మరింత నీరసం తెప్పించింది. పూరన్ తప్ప ఒక్కరూ కూడా రాణించలేకపోయారు. ప్రధాన బౌలర్లందరూ ఓవర్‌కు పదికి పైగానే పరుగులు సమర్పించుకున్నారు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ పంజాబ్ బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడలేకపోయారు. పూరన్ తప్ప ఎవరూ 15 పరుగుల కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైతే ఈ సీజన్‌లో పంజాబ్ భవితవ్యం కష్టాల్లో పడినట్టే.
పంజాబ్ జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రన్ సింగ్, రవి భిష్ణోయ్, దీపక్ హుడా, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ షమీ, కాట్రెల్.
కోల్‌కతా బలాలు
వరుస విజయాలతో కోల్‌కతా జట్టు మంచి జోష్‌లో ఉంది. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్ పంపాలని నిర్ణయించుకోవడం గత మ్యాచ్‌లో బాగా కలిసొచ్చింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రాహుల్ 51 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. బౌలర్లందరూ సమష్టి ప్రదర్శన చేయడంతో చెన్నై టీమ్ 167 పరుగులను ఛేదించలేక 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌లలో కోల్‌కతా ఒకటి. శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్ వంటి స్టార్స్ బ్యాటింగ్‌లోనూ, ప్యాట్ కమ్మిన్స్, శివం మావి, నాగర్కోటి, వరుణ్ వంటి సమర్థులు బౌలింగ్ విభాగంలోనూ ఉన్నారు.
బలహీనతలు
గత మ్యాచ్‌లో రాహుల్ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు వెళ్లినప్పటికీ కెప్టెన్ దినేష్ కార్తీక్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. గత సీజన్‌లో అదరగొట్టిన ఆల్ రౌంటర్లు ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ ఈ సీజన్‌లో ఆకట్టుకోలేకపోతున్నారు. రస్సెల్ బంతితో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాట్‌తో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇక, సునీల్ నరైన్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతున్నాడు. వీరి ఫామ్ కోల్‌కతా శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తోంది.
కోల్‌కతా జట్టు (అంచనా)
రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్, నాగర్కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి.
మ్యాచ్ ఫేవరెట్
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్‌పై కోల్‌కతాదే ఆధిపత్యం. ఇప్పటివరకు ఈ రెండు టీమ్‌లూ 25సార్లు తలపడగా అందులో 17సార్లు కోల్‌కతానే విజయం వరించింది. పంజాబ్ కేవలం 8 సార్లు మాత్రమే గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కూడా కోల్‌కతానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరి, రాహుల్ సేన ఏం చేస్తుందో చూడాలి.











