బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న క్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటోరియాలు, హాళ్లల్లో జరిగే సమావేశాలు, సభలకు హాజరయ్యేందుకు అనుమతులను సడలింపులిచ్చింది. ఆయా హాళ్ల సమార్థ్యాన్ని బట్టి 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపింది. గరిష్టంగా రెండొందల మంది వరకు ఈ సమావేశాలకు పాల్గొనవచ్చు. ఓపెన్ గ్రౌండ్ ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాల్లో ఆయా ప్రదేశాల సామార్థ్యాన్ని బట్టి 50 శాతం వరకు మించకూడదని తాజా ఉత్తర్వుల ప్రకారం తెలిపింది. సమావేశాలు, సభలకు హాజరయ్యేవారు కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. అలాగే థర్మల్ స్క్రీనింగ్ చేయడం, శానిటైజర్లు ఉపయోగిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయపార్టీలు నిర్వహించుకునే రాజకీయ సమావేశాలు, సభలు జరుపుకునేందుకు 50 శాతం మందికి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీన కేంద్రం అన్‌లాక్ 5.0 నిబంధనలు ఈమేరకు విడుదల చేసింది. వందమందికి మించకుండా సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలని పేర్కొన్నది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే వివిధ రాష్ట్రాలలో జరిగే ఎన్నికల నేపథ్యంలో పాత నిబంధనలను సవరిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. 50 శాతం మించకుండా సభలు, సమావేశాలు జరుపుకునేలా నిబంధనలు మార్పులుచేర్పులు చేసినట్లు తెలిసింది.











