గెలుపు కోసం శ్రమిస్తారు. తీవ్రంగా తపిస్తారు. దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ.. దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం అందుకు భిన్నమైన సిత్రం కనిపిస్తోంది. త్వరలో జరిగే ఈ ఉప ఎన్నికల్లో ఓటమి ఖరారైనా.. ఏ మాత్రం వెనుకాడక శ్రమిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అంతకు ముందు కూడా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు ఎదురులేదు. గులాబీ బాస్ కేసీఆర్ చదువుకున్న ఊరు కావటం.. తర్వాతి కాలంలో హరీశ్ రావు కనుసన్నల్లో ఉండే నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి.
భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం గులాబీ కంచుకోటల్లో ఒకటిగా దుబ్బాకను హరీశ్ మార్చుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు లోగుట్టుగా వ్యాఖ్యానిస్తుంటాయి. దీనికి తగ్గట్లే.. ప్రతి ఎన్నికల్లోనూ తన చుట్టూ ఉన్న నియోజకవర్గాల మీద పట్టు పెంచుకున్న హరీశ్.. స్థానిక రాజకీయాల్ని శాసిస్తుంటారన్న పేరుంది. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బరిలో ఉన్న అభ్యర్థి సుజాతకు అండగా నిలుస్తూ.. అంతా తానై అన్నట్లు నడిపిస్తున్నారు.
అంతేకాదు.. ప్రత్యర్థి పార్టీల మీద ఒంటికాలి మీద లేస్తున్న ఆయన.. అనుక్షణం లోకల్ సెంటిమెంట్ ను రాజేయటం ద్వారా ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారు. అదే సమయంలో ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థుల పరిస్థితి మరోలా ఉంది. ఓటమి ఖాయమన్న విషయంపై స్పష్టత ఉన్నప్పటికీ ఆ పార్టీలు శ్రమిస్తున్న తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. బీజేపీ బలపడినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే బీజేపీ నేతలు సైతం తరచూ తామే ప్రధాన ప్రతిపక్షమన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ బలహీనమైందన్న విషయాన్ని వారు పదే పదే ప్రస్తావిస్తూ.. 2023లో జరిగే ఎన్నికల్లో తమదే విజయమన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే.
ఇలాంటి వాదనలకు చెక్ పెట్టానికి దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ఒక అవకాశంగా మారింది. గెలిచే అవకాశం లేకున్నా.. తమ సత్తా ఏమిటో చాటేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న వ్యూహాన్ని ఆ పార్టీ అనుసరిస్తోంది. హరీశ్ అండ్ కోను ఎంతలా ఇరిటేట్ చేయగలిగితే తాను అంత విజయం సాధించినట్లుగా భావిస్తోంది. అదే సమయంలో మెజార్టీని తగ్గించటం ద్వారా.. తనదైన హెచ్చరికలు పంపాలని భావిస్తోంది.
బీజేపీ విషయానికి వస్తే.. అదిలోనే హంసపాదన్నట్లుగా పార్టీ అభ్యర్థికి చెందినట్లుగా చెప్పే భారీ మొత్తం కారులో తరలిస్తూ దొరికిపోవటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గులాబీ బాస్ ఫ్యామిలీ అవినీతి గురించి ప్రస్తావించే అవకాశం లేని రీతిలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాతి స్థానం తనదే ఉండాలన్నది బీజేపీ ఆలోచన.
దీని ద్వారా.. తెలంగాణలో తాము బలపడ్డామని చెప్పటంతో పాటు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న విషయాన్ని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ద్వారా చెప్పాలన్న ఆలోచనలో ఉంది. ఇలా రెండు విపక్ష పార్టీలు గెలుపు కంటే కూడా.. ఓడినప్పటికీ అధికారపక్షం గెలుపును తక్కువగా చేసి చూపించే అవకాశం కోసం తహతహలాడటం దుబ్బాక ఉప ఎన్నిక ప్రత్యేకతగా చెప్పక తప్పదు.