విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా.. నిర్మించిన కనదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభంన శుక్రవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ వర్చ్యువల్ గా ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి ఢిల్లీనుంచే ఆన్‌లైన్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొంటారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు 7584 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమిపూజ కూడా వర్చువల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఇప్పటికే 8007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ లు జాతికి అంకితం చేస్తారు. అలాగే మొత్తం 15 వేల కోట్ల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి.
ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో చంద్రబాబునాయుడు హయాంలోనే ప్రారంభం అయింది. పూర్తిగా రాష్ట్ర, కేంద్రప్రభుత్వ నిధులతో దీనిని నిర్మించారు. నితిన్ గడ్కరీ స్వయంగా అప్పట్లో శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా పూర్తిచేయాలని అనుకున్నారు గానీ.. రకరకాల కారణాల వల్ల జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇటీవల పూర్తయింది. అప్పటినుంచి, ప్రారంభోత్సవానికి ఇప్పటికి మూడుసార్లు ముహూర్తం పెట్టారు. వివిధ కారణాల వల్ల ప్రతిసారీ వాయిదా పడింది. ప్రధానంగా.. కేంద్రంమంత్రి నితిన్ గడ్కరీని నేరుగా ఆహ్వానించి కార్యక్రమం నిర్వహంచాలనుకున్నారు. కానీ, ఆయనకు కుదరలేదు. తీరా ఇప్పుడు నిర్ణయించిన ముహూర్తానికి ప్రారంభం కూడా వర్చువల్ గా జరగనుంది. ఇంతకంటె ఎక్కువ జాప్యం చేస్తే ప్రజలనుంచి విమర్శలు తప్పవన్న భయంతో ప్రారంభించేస్తున్నారు.
జగన్‌కు వర్చువల్ పద్ధతి ఎందుకు..
నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి రావడానికి ఇబ్బందులు ఉన్నాయని అనుకోవచ్చు. పని ఒత్తిడిగా భావించవచ్చు. కానీ, ఈ కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు కూతవేటు దూరంలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి కూడా వర్చువల్ పద్ధతిలోనే ఎందుకు పాల్గొంటున్నారు అనే ప్రశ్న ప్రజలకు ఎదురవుతోంది.
నిజానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు! ఎలివేటెడ్ హైవేలలో సాధారణంగా ఫోర్ లైన్లుగానే ఉంటాయి. కానీ సిక్స్ లైన్ ఫ్లైఓవర్ గా దీనిని నిర్మించారు. ఇంకా అనేక విశిష్టతల దృష్ట్యా ఇది దక్షిణ భారతదేశంలో మొదటిదిగా, దేశంలో మూడోదిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన వంతెనను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వయంగా హాజరు కావడంలేదు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంనుంచే ఆయన కార్యక్రమంలో పాల్గొంటారు.
జగన్‌కు మొహం చెల్లడంలేదా?
ఎందుకిలా.. ఇంత గొప్ప ప్రాజెక్టు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ప్రారంభం అవుతున్నప్పుడు తాను స్వయంగా వెళ్లి.. తన చేతులమీదుగా చేయాలనే ఉత్సాహం ఎవ్వరికైనా ఉంటుంది. కానీ జగన్ ఇంటినుంచే చేయడానికి సరైన కారణమే ఉందని అంటున్నారు విశ్లేషకులు. కనకదుర్గ ఫ్లైఓవర్ అనే స్వప్నం సాకారం కావడం వెనుక తెలుగుదేశం కృషే ఎక్కువ. నిజానికి ఇక్కడ ఫ్లైఓవర్ సాధ్యం కాదనే గతంలో కొట్టిపారేశారు. కానీ తెలుగుదేశం నాయకులు దీనికోసం దీక్షలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పట్లో ఎన్డీయే సర్కారులో భాగస్వామిగా ఉండడంతో.. రాష్ట్రానికి సాధించుకు వచ్చిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో 502 కోట్ల విలువైన ఈ ఫ్లైఓవర్ కూడా ఒకటి. కాంట్రాక్టరు సంస్థ హామీ ఇచ్చిన దానికి భిన్నంగా పూర్తికావడంలో జాప్యం జరిగింది. కానీ.. ఆయన మాత్రం క్రమంతప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో అలసత్వాన్ని దూరం చేయడానికి ప్రయత్నించారు. ఆయన సమీక్షలు ఎక్కువయ్యాయే తప్ప పనులు జరగడం లేదనే విమర్శలూ అప్పట్లో వచ్చాయి. ఏదేమైనప్పటికీ.. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు పూర్తయింది.
ఎంత జాప్యం జరిగినా కనకదుర్గ ఫ్లైఓవర్ సాధ్యం కావడానికి సంబంధించిన క్రెడిట్ పూర్తిగా తెలుగుదేశానికే దక్కుతుంది. మొదలుపెట్టారే గానీ.. పూర్తిచేయడం వారి వల్ల కాలేదని, చంద్రబాబు వైఫల్యమే దీనికి కారణమని.. ఆ క్రెడిట్ ను తాము లాక్కోడానికి మంత్రి వెలంపల్లి లాంటివాళ్లు చాలా ప్రయత్నించారు గానీ.. అది సాధ్యం కాలేదు. విజయవాడకే చెందిన వెలంపల్లి ఈ ప్రారంభోత్సవానికి స్వయంగా హాజరు కాలేని స్థితిలో ఉన్నారు. జగనన్న వల్లనే ఈ ఫ్లైఓవర్ పూర్తయిందని పార్టీ వారు ఎంతగా చెప్పుకుంటున్నా.. ఆ వాదన ప్రజల్లోకి వెళ్లలేదు. కనీసం వారి పార్టీకి కూడా అలాంటి నమ్మకం కలగనట్లుంది. అందుకే జగన్ కూడా ఇంట్లోంచే వర్చువల్ పద్ధతిలోనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చంద్రబాబుకు కీర్తితెచ్చిపెట్టే ప్రాజెక్టును, తన చేతులమీదుగా ప్రారంభించడానికి జగన్‌కు మొహం చెల్లడం లేదని పలువురు అంటున్నారు.
ఈ విముఖత కరెక్టు కాదు..
తాను ప్రభుత్వానికి కస్టోడియన్ మాత్రమే అని గుర్తించలేకపోతే, ఎవ్వరికైనా ఇలాంటి సంకోచాలు ఉంటాయి. దీనివెనుక చంద్రబాబు కృషి ఉందని ప్రజలు అనుకున్నంత మాత్రాన అది చంద్రబాబు సొత్తు కాదు. పని- ప్రభుత్వానిది అవుతుంది. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న కస్టోడియన్ జగన్. ఆ స్పృహ ఆయనకు ఉంటే ఎంచక్కా ప్రారంభోత్సవంలో పాల్గొనవచ్చు. గతంలో హైదరాబాదులో పీవీనరసింహారావు ఎలివేటెడ్ హైవేకు సంబంధించిన కృషి మొత్తం చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఆ తర్వాత.. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఆయన స్వయంగా దానిని ప్రారంభించారు. పార్టీలు ఎలా క్లెయిం చేసుకున్నా.. దాని వెనుక చంద్రబాబు ప్రయత్నం అందరికీ తెలుసు. ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ అయినా అంతే. ఇంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ప్రారంభిస్తే బాగుండేదని విజయవాడ వాసులు అనుకుంటున్నారు.











