నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో నిర్మాణాలపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. నగరంలో వర్షాల కారణంగా అనేక ఇల్లు కూలడంతో పాటు మరికొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల్లో ఎప్పుడు ఏ కట్టడం కూలుతుందో.. ఏ అనర్దం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ఏడాది క్రింత అందుబాటులోకి వచ్చిన మెట్రో పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో మెట్రో పిల్లర్లకు కూడా ముంపు పొంచి ఉందంటూ మెస్సేజ్ లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో సైతం అనుమానాలు ఎక్కువయ్యాయి.
వదంతులు నమ్మకూడదంటూ మెట్రో అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నా అనుమానాలు మాత్రం నివృత్తి కావడం లేదు. దీంతో మెట్రో యంత్రాంగం- ప్రజలకు నమ్మకం కలిగించేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని మొదలు పెట్టింది. ముఖ్యంగా మూసీ తో పాటు నాలాల పక్కన నిర్మించిన పిల్లర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్రోలింగ్ ప్రారంభం కావడంతో ఆయా ప్రాంతాల్లో మరోమారు పరీక్షలు నిర్వహించింది మెట్రో. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, మెట్రో పటిష్టంగా నిర్మించామని చెబుతోంది మెట్రో. గతంలో సైతం ఇలాంటి వార్తలే అనేక సార్లు ట్రోల్ అయ్యాయి. వర్షాలు పడ్డ ప్రతీసారి ఇంలాటి వార్తలు వస్తుండటంతో సంస్థ ఇరకాటంలో పడటం కామన్ అయిపోయింది.
గతంలో అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద వర్షానికి పెచ్చులు ఊడి స్టేషన్ కింద నిలుచున్న మహిళపై పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అంతే కాకుండా భారీ వర్షాల కారణంగా మెట్రో రేయిలింగ్ మధ్యలో నుండి నీరు కిందికి జాలు వారడంతో నాణ్యత సరిగా లేదంటూ వార్తలు హల్చల్ చేసాయి. దీంతో ఈ వార్తలను సైతం కొట్టిపారేసిన మెట్రో అధికారులు ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదంటున్నారు. ఇక మెట్రో రైల్లు చాలా సార్లు అర్థాంతరంగా ట్రాక్ పై స్టేషన్ల మధ్యలో నిలిచి పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతూ వచ్చారు. పొల్యూషన్ కారణంగా విద్యుత్ లైన్లలో సరఫరా సరిగా లేకపోవడంతోనే రైళ్లు నిలిచి పోయాయని.. వెంటనే సమస్యను సరిచేసి రైళ్లను నడిపించింది యాజమాన్యం.
తాజాగా జరిగిన పరిణామాలు కూడా ప్రజల అనుమానాలు మరింత రెట్టింపు చేసాయి. భారీ వర్షాల కారణంగా మూసాపేట వద్ద మెట్రో నిర్మాణం పక్కనే సొరంగ మార్గం ఏర్పడటం.. చెరువు నుండి వచ్చిన నీరు అందులోకి వెళ్ళడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేసారు. భారీ వరద నీటితో రోడ్డు కోతకు గురైందని దీనిని చూసి పుకార్లు సృష్టించారని ఘటనను కొట్టిపారేసింది మెట్రో యాజమాన్యం. ప్రస్తుతం సొరంగం పడ్డ ప్రాంతాన్ని మూసి వేసి నిర్మాణ కార్యక్రమాలుచేపట్టామని.. త్వరలోనే సాధారణ స్థితికి వచ్చేస్తుందని తెలిపింది. ప్రజలకు అనుమానాలు నివృత్తి అయ్యేలా శాశ్వతంగా పుకార్లకు చెక్ పెట్టేందుకు మెట్రో యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ప్రజలు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా నగరానికి మణిహారంగా నిర్మించిన మెట్రోలో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు నిర్మాణ రంగ నిపుణులు. వారికి ఆ భరోసాను మెట్రో కల్పించాలి.











