2014లో టీడీపీ, బీజేపీ జనసేన కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. టీడీపీ అధినేత అవినీతి డబ్బుతో వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల తరవాత పరిస్థితి తారుమారు అయింది. 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. అయినా వైసీపీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని జగన్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎంత ఖర్చయినా పరవాలేదు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి తీసుకురావాలని చేయని ప్రయత్నం లేదు. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేల వ్యాపారాలను దెబ్బతీయడం, వారి వ్యాపారాలను సీజ్ చేయడం చేయించారు. ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన గ్రానైన్ కంపెనీల లీజుల రద్దు ఈ కోవలోకే వస్తాయి. ఇలా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని వైసీపీ వైపు తిప్పుకోగలితారు. మరికొందరిని వైసీపీలోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
వైసీపీ నేతల గగ్గోలు…
టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైంది. గన్నవరం నియోజకవర్గంలో పదేళ్లు టీడీపీతో పోరాడి ఎన్నో కేసులు ఎదుర్కొన్న వైసీపీ నేతలు నేడు, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేతో పనిచేయడానికి వారు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. వైసీపీకి ప్రజలు పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. టీడీపీ నుంచి ఒక్క నాయకుడిని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి తీసుకువచ్చి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తున్నాయి. వైసీపీలో ఉన్న నేతలకే పనిలేక గోళ్లు గిళ్లు కుంటున్నారు. ఇక టీడీపీ వారిని వైసీపీలోకి తీసుకువచ్చి మా నెత్తిన పెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నారని విమర్శించి, నేను మన జగనన్న కూడా అదే చేస్తున్నాడని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వలస నేతలో ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువ…
జంప్ జిలానీలను నమ్మడానికి వీల్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారు. వారు అధికారం కోల్పోతే వెంటనే ప్లేటు పిరాయిస్తారు. అలాంటి నేతలను నమ్ముకుని పార్టీలను నడపడం చాలా కష్టం. వారితో ఏ పార్టీకైనా ప్రయోజనం కంటే, నష్టమే ఎక్కువ. అలాంటి నేతలు మహా అయితే వారి నియోజకవర్గంలో గెలవగలరు. కానీ వారి వల్ల ఆయా పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా మైలేజీ తగ్గిపోతోంది. చంద్రబాబు వైసీపీ నేతలకు టీడీపీలోకి తీసుకుని వారికి మంత్రి పదవులు కట్టబెట్టి పెద్దతప్పే చేశారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీకోసం పనిచేస్తూ నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారిని కాదని తాజాగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెడితే, కార్యకర్తలకు అధినేత ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్టు. అదే తప్పు జగన్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవులు కట్టబెట్టారు. జగన్ ఇంకా ఆ పని చేయలేదు. మంత్రివర్గ విస్తరణలో ఆ ఒక్కటి కూడా కానిస్తే… ఇక ఇద్దరూ ఇద్దరే అని ప్రజలకు అర్ధం అవుతుంది.
నేతలతో కిక్కిరిసిన వైసీపీ
వైసీపీ నేతలతో నియోజకవర్గాలు కిక్కిరిసిపోతున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో, వారి అనుచరులు పదవులు ఆశిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తవుతున్నా నేటికీ పదవులు దక్కకపోవడంతో అనేక మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల స్థాయిలో మార్కెట్ యార్డు పదవి ఉన్నా దానికి కూడా పది మంది పోటీ పడుతున్నారు. ఇవన్నీ చూసి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు స్పీడు తగ్గించారు. వారి వ్యాపారాలు వారు చూసుకుంటున్నారు. వైసీపీలో నేతలు ఎక్కువైపోయి, పదవుల భర్తీ లేకపోవడంతో అసంతృప్తి మొదలైంది. అందుకే తాజాగా 29 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించి కొంత మేర వైసీపీ నేతల ఆగ్రహం తగ్గించాలని అధిష్టానం భావిస్తోందట.











