సమస్యలను పరిష్కరించకుంటే తగిన గుణపాఠం చెప్తాం!
పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను ఉపాధ్యాయ, ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేఏసీ నుంచి ఉపాధ్యాయులు బయటకొచ్చి.. ఉద్యమ బాటపట్టారు. దఫాలవారీగా ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉపాధ్యాయ సంఘాలు బహిరంగ లేఖ రాశారు. ఐదుసార్లు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడంతో సీఎంకు బహిరంగ లేఖ రాసి విడుదల చేస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. తమ డిమాండ్లకు స్పందించకుంటే రాజకీయంగా దెబ్బతీస్తామంటూ జేఏసీ చేస్తున్న హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఏపీలో పీఆర్సీ పోరు ముగిసిందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ, మరికొన్ని ఉద్యోగ జేఏసీలు తాజాగా సీఎంకు లేఖ రాశాయి. ఐఆర్ రికవరీ నిలిపివేతతో పాటు ఇతర అంశాలపై ఉద్యోగులకు ఇప్పటికే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని గుర్తు చేశారు.
మేము తల్చుకుంటే 75 మంది ఎమ్మెల్యేలను ఓడిస్తాం!
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, విశ్రాంతి ఉద్యోగులు తల్చుకుంటే అధికార పార్టీ 75 మంది ఎమ్మెల్యేల్ని ఓడించే శక్తి తమకుందని జేఏసీ నేతలు వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ 75 మందిని ఓడిస్తామన్న పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే.. తగిన గుణపాఠం చెప్తామంటూ జేఏసీ నేతలు హెచ్చరించారు. త్వరలో పీఆర్సీపై పునస్సమీక్షించాలని డిమాండ్ చేస్తూ .. మార్చి 2 నుంచి 5 వరకూ ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పిస్తామని జేఏసీ ప్రకటించారు. మెరుగైన పీఆర్సీ పీట్మెంట్, సీపీఎస్ రద్దు, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల జేఏసీ సీఎం జగన్ కు ఘాటుగా ఈ లేఖ రాశారు.
Must Read:-ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు.. పీఆర్సీ సాధించే వరకు ఉద్యమం ఆగదు!