ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెవెన్యూ శాఖపై కన్నెర్ర చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉన్న రెవెన్యూ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది. కృష్ణా జిల్లాలోని ప్రధాన రెవెన్యూ కార్యాలయాలపై గురువారం నాడు దాడులు చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఇబ్రహీపట్నం రెవెన్యూ కార్యాలయంలో దాడుల సందర్భంగా రెండు లక్షల 40 వేల రూపాయలు దొరికాయి.
అలాగే జగ్గయ్యపేట రెవెన్యూ కార్యాలయంపై జరిగిన దాడిలో కార్యాలయానికి సంబంధం లేని రూ. 4 వేల రూపాయల వరకూ అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోనూ అధికారులు దాడులను ముమ్మరం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో దాడులు ముమ్మరం చేశారు.
గడచిన నాలుగు నెలలుగా కొవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మళ్లీ పది రోజులుగా రాష్ట్రంలో స్థలాలు, ఇళ్లు, పొలాల రిజిస్ట్రేషన్లు మెల్లమెల్లగా ఊపందుకుంటున్నాయి. దీంతో అవినీతికి మళ్లీ తెర లేచినట్లు అని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణాలో చేసినట్టు…
తెలంగాణలో వివిధ జిల్లాల్లో రెవెన్యూ అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎవ్వరూ ఊహించనంత డబ్బు దొరుకుతూండడంతో అధికారులే కాదు… ప్రజలు కూడా అవాక్కవుతున్నారు. కీసర తహశీల్దార్ తో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ కార్యాలయాల్లో కూడా దాడులు ముమ్మరం చేసి అవినీతి సొమ్మును వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖపై మూడో కన్ను తెరవాలన్నది జగన్ ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఈ దాడుల కారణంగా ప్రజల నుంచి కూడా మంచి పేరు వస్తుందనేది జగన్ ప్రభుత్వం అంచనా.
అవినీతి రహిత శాఖగా…
ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖతో పాటు పోలీస్, పంచాయతీ వంటి కీలక శాఖలను అవినీతి రహిత శాఖలుగా మార్చాలన్నది జగన్ ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది. ప్రజలతో నేరుగా సంబంధాలుండే ఈ శాఖల ప్రక్షాళన జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నది ప్రభుత్వ పెద్దల నమ్మకం. అంతే కాకుండా ఈ శాఖల్లో- రెవెన్యూ శాఖ ద్వారా వచ్చే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందనేది భావన.
రెవెన్యూ శాఖ ద్వారా ఇన్నాళ్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడేది. ఆ ఆదాయం రాకుండా రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు చేసే వారంతా వాటిని వాటాలుగా పంచుకుంటున్నారు. ఇక ముందు అలా కాకుండా కచ్చితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వచ్చేలా చేయాలన్నది ప్రభుత్వం సంకల్పం.
రెవెన్యూలో పని చేసే వారందరికీ జీతం కంటే గీతం ఎక్కువ వస్తోందని, ఈ శాఖలో పని చేస్తున్న వారిలో చాలా మంది అవినీతి ఊబిలో కూరుకుపోయిన వారేనన్నది ప్రభుత్వ భావన. కార్యాలయాలపై దాడులు ముమ్మరం చేయడంతో పాటు అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. ఇందులో భాగంగానే ముందుగా రెవెన్యూ శాఖపై దాడులతో ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన శాఖల ప్రక్షాళన చేపట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.