(విశాఖపట్టణం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
గత ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్‌లో ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక దాని ప్రాధాన్యాన్ని బయటకు రాకుండా చేయడమే వైయస్సార్సీపి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.
మన దేశంలో వైద్యం ఎంత ఖరీదైన అంశ మో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్య పరికరాల్లో 98 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని స్వదేశీ పరిజ్ఞానంతో వైద్య పరికరాలను తయారు చేయాలని గాజువాక సమీపంలోని పెద గంట్యాడ మండలం లో 2018 డిసెంబర్ లో మెడ్ టెక్ జోన్ ను ప్రారంభించారు.
18 రకాల అత్యున్నత స్థాయి లేబరేటరీ లను నెలకొల్పారు. ఇందులో 15 ప్రభుత్వ రంగ సంస్థలు ఆరు అంతర్జాతీయ సంస్థలు కలిసి పని చేస్తాయి. 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, తొలివిడతగా తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. పాతిక వేల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.
కట్ చేస్తే….
వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ ఏం జరుగుతుందో మూడో కంటికి తెలియడం లేదు. బయట వ్యక్తులు లోనికి ప్రవేశించే అవకాశం లేదు. లోపల ఏం జరుగుతోందో బయటికి కనిపించే ప్రసక్తే లేదు. దీంతో ప్రస్తుతం ఇది ఒక రహస్య కేంద్రంగా నడుస్తోంది. రక్షణ శాఖకు సంబంధించిన శాఖలు కూడా ఇంత గోప్యంగా తమ కార్యకలాపాలు నిర్వహించవేమో! ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఈ మెడ్ టెక్ జోన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది అనడంలో సందేహం లేదు.
పీపీఈ కిట్లు మొదలు… వెంటిలేటర్ల వరకు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన అనేక వస్తువులు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. కానీ వాటి గురించి ఎటువంటి సమాచారం బయటకు పొక్కడం లేదు. వివరాల కోసం అధికారులకు… పి ఆర్ వో కు మెయిల్ పెట్టినా స్పందన ఉండటం లేదు. గత ప్రభుత్వం ముందుచూపుతో ఏర్పాటుచేసిన మెడికల్ జోన్ వల్ల ప్రస్తుత ప్రభుత్వం లబ్ధి పొందుతోందని ప్రజలకు తెలియకుండా చేయడమే అంతిమ లక్ష్యంగా తెలుస్తోంది.
ప్రస్తుతం అక్కడ ఎన్ని పరిశ్రమలు కొనసాగుతున్నాయి? ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? ఎటువంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు? వాటి ధరలు ఎలా ఉన్నాయి? ఇలాంటి విషయాలు ఏవీ బయటకు పొక్కకుండా ప్రభుత్వం తొక్కి పడుతోందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. కానీ ఇలాంటి విషయాలను ఎంతకాలం దాచి ఉంచగలరో కూడా అర్థం కావడం లేదు.