Jagan Reddy Bhajan Group In The AP Assembly
గురుతర బాధ్యతను మరిచి .. గురుభక్తే మొగ్గు!
అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలపై ఇరు పక్షాలు చర్చించి ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షాలు అధికార పార్టీ పాలన లోపాలను చూపెట్టడం, లేక ప్రజల సమస్యలను అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం లాంటివి జరుగుతుంటాయి. అది ప్రజాప్రతినిధుల గురుతర బాధ్యత. కానీ గత రెండున్నరేళ్ల కాలంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ వారి మీద సెటైర్లు వేస్తూ మాట్లాడడం. వారిని కించపరచడానికి, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి , అలాగే వీలు దొరికించుకొని మరి ముఖ్యమంత్రి జగన్ ను పొగడడానికి వేదికగా మారుస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ నాయకులు వరసబెట్టి జగన్ పొగుడుతుంటే ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
Jagan Reddy Bhajan Group In The AP Assembly
జగన్ ను క్యూ కట్టి పొగుడుతున్న నాయకులు
ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి జగన్ ను ఆపార్టీ ఎమ్మెల్యేలు క్యూకట్టి పొగిడేస్తున్నారు. అసెంబ్లీ అంటే నాయకుడిని పొగిడే వేదిక అనుకుంటున్నారో ఏమో మరి. మొన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనకు కరోనా వచ్చినపుడు జగన్ గారు చేసిన సేవలు అంటూ రాగాలు తీసి జగన్ ‘యుగపురుషుడు’ లాగా చూపి మోసేసింది! అలాగే నగరి ఎమ్మెల్యే రోజా రెడ్డి కూడా ఏవేవో లెక్కలు చెప్పి అలా చేయాలంటే మనసున్న వైఎస్ కుటుంబానికే చెల్లు అని, ఆకాశానికి సూర్యుడు ఒక్కడే..ఆంధ్ర రాష్ట్రానికి మనసున్న అన్న ఒక్కడే అతడే జగనన్న అని సినీమా డైలాగు పేల్చి .. ఆకాశానికి ఎత్తేసిసింది. ఆనవాయితీ ప్రకారంగా నిన్న అసెంబ్లీలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ని పొగుడుతూ ఈ లాగు కవిత అందుకున్నారు…. ‘అన్నలగన్న అన్న .. అందరికన్నా మిన్న…! ఆయన మనసు చల్లని వెన్న … వివక్షతలో సున్నా…! ఆయనే మన అన్న…. అంటూ చుట్టు పక్కల చూసేసరికి చుట్టుపక్కల కూర్చొని ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనే జగనన్న’ అంటూ కోరస్ అందుకున్నారు. అంతటితో ఉరుకోకుండా మెప్పు కోసం కాదంటూనే.. సమ సమాజ నిర్మాణం మనధ్యేయం. సకల జనుల సౌభాగ్యం మన లక్ష్యం అంటే ఏకంగా పాటనే పాడారు. అసలు వీళ్ళు నాయకులా లేక మోచేతికింద నీళ్లు తాగే బానిసలా…వీరికి ఓట్లు వేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి జగన్ భజన చేయడానికా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరికి రాజకీయ సిద్ధాంతాలు, ఎథిక్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? సమాజంలో పేరుకు పోయిన సామాజిక రుగ్మతలపై పోరాడి సమ సమాజ స్థాపనకు కృషి చేసే వంటి అంశాలు వీళ్లుకు ఎందుకు పట్టడం లేదు? అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలా అసెంబ్లీకి వచ్చి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఆరాధన చేస్తూ .. విలువైన అసెంబ్లీ సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తూ అసెంబ్లీని జగన్ భజనాలయంగా మారుస్తున్నారని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.











