కరోనా లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేక అనేక మంది పేదలు, చిన్న, వీధి వ్యాపారుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. వీరికి రూ.10 వేల వరకు రుణాలిప్పించి ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘‘జగనన్న తోడు’’కు నిబంధనల పేరుతో బ్యాంకర్లు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో రుణాలిస్తామని నమ్మబలికిన బ్యాంకర్లు తర్వాత అనేక నిబంధనలు విధించడంతో రుణాలందక లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. ఈ పథకాన్ని ప్రకటించిన అధికారులు తర్వాత అమలును పట్టించుకోకపోడంతో ఎవరికి ప్రయోజనం కలగడం లేదు.
సిబిల్ స్కోర్ ఉంటేనే..
ఏపీ ప్రభుత్వం ‘జగనన్న తోడు’ అనే సంక్షేమ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన చిరు వ్యాపారులు అందరికి బ్యాంకర్ల ద్వారా రూ. 10 వేలు రుణం మంజూరు చేయించాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో రుణాలిస్తామని ప్రకటించిన బ్యాంకర్లు క్షేత్ర స్థాయిలో బ్యాంకులకు వెళ్లిన లబ్ధి దారులకు కోవిడ్ ని మించిన షాక్ ఇస్తున్నారు. రూ.10 వేలు రాయితీ లేని రుణం కావాలంటే తాము నిర్ధేశించిన ప్రమాణాల మేరకు సిబిల్ స్కోర్ ఉండాలంటున్నారు. రోజు వారీ వ్యాపారం చేసుకునే తమకు సిబిల్ స్కోర్ ఎలా ఉంటుందంటే.. అవన్నీ తమకు తెలియదని… తమ నిబంధనలు అని రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు తిరస్కరిస్తూ, పెండింగ్ లో ఉంచుతూ చిరువ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారు.
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా …
ఓ గంపలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే ఓ వృద్ధురాలు, తోపుడు బండ్లపై పళ్ళు అమ్ముకునే వారికి సిబిల్ స్కోర్ అంటేనే అసలు తెలియదు. చాలా మందికి అసలు బ్యాంకు ఖాతాలు కూడా ఉండవు. అలాంటి వారికి కష్ట సమయంలో అండగా ఉండాల్సిన బ్యాంకర్లు సవాలక్ష నిబంధనలతో చుక్కలు చూపిస్తున్నారు.
మాట ఇచ్చి తప్పుతున్న బ్యాంకర్లు..
రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ లో చిరువ్యాపారులకు రూ.10 వేలు రుణం ఇస్తామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన రుణానికి సంబంధించిన అసలు, వడ్డీ లబ్ధిదారులు చెల్లిస్తారని.., తర్వాత వారు కట్టిన వడ్డీని తాము లబ్ధిదారులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది . సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై ప్రకటన కూడా చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి అర్హుడైన లబ్ధిదారుడూ రుణం తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కాని కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 60 ఏళ్ళు దాటిన వారి దరఖాస్తులు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు లబ్ధిదారుడు చేసే వ్యాపారం లాభదాయకం కాదంటూ రుణాలివ్వడం లేదు. గతంలో ముద్ర లోన్ తీసుకుంటే ఈ రుణం ఇవ్వమని అంటున్నాయి. దీంతో దాదాపు 10 లక్షల మందికి సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం బ్యాంకు నిబంధనల్లో సమాధి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
పాన్ కార్డు కూడ కావాలట..
సచివాలయ ఉద్యోగులు, మెప్మా, డీఆర్డీఎ అధికారులు , చివరకి కలెక్టర్లు చెప్పినా కూడా నిబంధనల పేరుతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. పొట్టకూటి కోసం రోజు వ్యాపారం చేసుకునే కొందరికి జన్ ధన్ అకౌంట్లు కూడా లేవు. కొందరికి అర్హత ఉన్నా జన్ ధన్ అకౌంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం బ్యాంకుల్లో మిషనరీ మారిపోయిందని, పాన్ కార్డు తప్పని సరంటూ అకౌంట్ కూడా ఓపెన్ చేయకుండా లబ్ధిదారుల దరఖాస్తులు పెండింగ్ లో ఉంచుతున్నారు. దీంతో వారు వేరే బ్యాంకుల్లో కూడ దరఖాస్తు చేసుకోవడానికి వీలుకావడం లేదు. చదువురాని చిరు వ్యాపారులు బ్యాంకర్ల నిబంధనలకు బెంబేలెత్తిపోతున్నారు.
మొదట్లోనే తప్పటడుగు ..
ఇప్పటికే ముద్ర లోన్ తీసుకున్న వ్యక్తికి మళ్లీ ‘జగనన్న తోడు ’ పథకం వర్తించదని బ్యాంకర్లు అంటున్నారు. దీంతోపాటు ఇప్పుడు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గతంలో ఎవరికైనా హామీ ఉండి, లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే సంతకం పెట్టిన పాపానికి బ్యాంకర్లు డిఫాల్టర్ గా ప్రకటించి రుణం ఇవ్వడం లేదు. వీటన్నింటిపై సమగ్రంగా చర్చించకుండా పథకం రూపొందించి, ప్రజల్లోకి తీసుకెళ్లడం వలన లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడున్నారు.
అధికారులు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపి చిరు వ్యాపారులకు తోడుగా నిలుస్తారా? లేక తమకేం సంబంధం లేదు… అంతా బ్యాంకర్లే చేశారని సీఎంఓ కళ్లు గప్పుతారో వేచి చూడాల్సిందే..!











