కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల కొండ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుకు సంబంధించి బుధవారం రాత్రి ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలోని టీడీపీ కూటమి సర్కారు టీటీడీకి నూతన పాలక మండలిని నియమించింది. తెలుగు వార్తా ప్రపంచంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న టీవీ5 న్యూస్ ఛానెల్ చైర్మన్ గా కొనసాగుతున్న బొల్లినేని రాజగోపాల్ నాయుడు అలియాస్ బీఆర్ నాయుడు టీడీపీ పాలక మండలి నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులు అవుతారన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమేనన్నట్లుగా బీఆర్ నాయుడిని కూటమి సర్కారు టీటీడీ చైర్మన్ గా నియమించింది. ఇక నాయుడు నేతృత్వంలోని టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా 24 మందిని కూడా కూటమి సర్కారు ప్రకటించింది.
టీవీ5 ఎండీగా ఉన్న బీఆర్ నాయుడు అంటే విపక్ష వైసీపీకి ఆది నుంచీ కడుపు మంటే. ఈ క్రమంలో తనకు గిట్టని బీఆర్ నాయుడు ఎక్కడ టీటీడీ చైర్మన్ కుర్చీపై కూర్చుంటారోనన్న భయం వైసీపీని చాలా కాలమే వెంటాడింది. అధికార వర్గాల్లో ఉన్న తన అనుయాయుల ద్వారా బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ గా పట్టాభిషేకం జరిగేందుకు రంగం సిద్ధమైపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న వైసీపీ అధిష్ఠానం.. ఎలాగైనా ఆ కుర్చీపై బీఆర్ నాయుడిని కూర్చోనివ్వరాదన్న కోణంలో ఆలోచన చేసింది. అనుకున్నదే తడవుగా తన సోషల్ మీడియాతో పాటు సాక్షి మీడియాను రంగంలోకి దించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నాయుడు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఏదేనీ కేసుల్లో ఉన్నారా? అన్న దిశగా శోధన చేసింది. ఈ క్రమంలో ఓ డ్రగ్స్ ముఠాతో నాయుడు గారో, లేదంటే ఆయన కుమారుడు, టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ తరచూ మాట్లాడుతున్నారన్న విషయం వారికి దొరికిందట.
అంతే… సదరు అంశంలో వాస్తవమెంత?, అసలు దేని కోసం వారు ఆ సంప్రదింపులు జరిపారు?.. డ్రగ్స్ ముఠాగా చెబుతున్న వారు నిజంగానే డ్రగ్స్ అమ్మేవారేనా?… వారు డ్రగ్స్ అమ్మడం నిజమే అయితే… వారి నుంచి నాయుడు గానీ, రవీంద్రనాథ్ గానీ డ్రగ్స్ కొనుగోలు చేశారా?… ఇలా ఆ వ్యవహారానికి సంబంధించిన అసలు విషయాలను నిర్దారణ చేసుకోకుండానే వైసీపీ శిభిరం తమకు నాయుడు దొరికిపోయారంటూ బీరాలు పలికింది. రేపే బిగ్ రివీల్ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఆ పార్టీ జబ్బలు చరుచుకుంది. తీరా బీఆర్ నాయుడు డ్రగ్స్ ముఠాలతో మాట్టాడుతున్నారంటూ ఆ మరునాడు వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన బిగ్ రివీల్ కాస్త పేలని దీపావలి టపాసు మాదిరి ఎదురు తన్నింది. అసలు ఆధారాలు లేకుండా ఇంత పెద్ద వార్తను… అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ను ఎలా బుక్ చేద్దామనుకుందో, ఏమో తెలియదు గానీ… తాను పేల్చిన బాంబు తుస్సుమనడంతో చిక్కచచ్చిపోయిన వైసీపీ నోరు మెదపకుండా సైలెంట్ అయిపోయింది.
ఈ పరిణామం నిజంగానే బీఆర్ నాయుడికి తలపై పన్నీరు పోసినంత పనిచేసింది. అప్పటిదాకా సమయం వచ్చినప్పుడు నాయుడుకు టీటీడీ పదవి అప్పగిద్దాంలే అన్న భావనతో కూటమి సర్కారు సాగింది. అయితే ఎప్పుడైతే… టీటీడీ కుర్చీపై డ్రగ్స్ వాడే వ్యక్తిని ఎలా కూర్చోబెడతారంటూ వైసీపీ చేసిన రచ్చ కూటమి సర్కారు పునరాలోచనలో పడేలా చేసింది. వాస్తవానికి వైసీపీ చేసిన ఆరోపణలను రవీంద్ర నాథ్ చీల్చి చెండాడారు. తమకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించిన నాయుడు గారి అబ్బాయి… ఈ తరహా నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానంటూ ఒకింత గట్టిగానే తగులుకున్నారు. దీంతో బీఆర్ నాయుడుకు పదవి ఇచ్చే విషయంలో ఇక జాప్యం చేయరాదన్న భావనతో కూటమి సర్కారు యుద్ధప్రాతిపదికన టీటీడీ బోర్డు సభ్యులను ఎంపిక చేసింది. అన్నీ పూర్తి చేసుకుని బుధవారం రాత్రి టీటీడీ చైర్మన్ గా నాయుడిని ప్రకటించింది.