టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో పాలన మొదలుపెట్టగానే కేవలం నెలల వ్యవధిలోనే రాష్ట్ర రూపు రేఖలు మారిపోతున్నాయి. అప్పటిదాకా అసలు ప్రశ్నార్థకంగా మారిన నూతన రాజధాని అమరావతిలో తిరిగి పనులు పున:ప్రారంభం కాగా… అమరావతిని ప్రధాన రైలు మార్గాలకు అనుసంధానం చేస్తూ నూతన రైల్వే లైనుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నిధుల కొరత వేధిస్తున్న అమరావతి నిర్మాణానికి కేవలం 4 నెలల వ్యవధిలోనే సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కేటినెబ్ మంత్రులు వివిధ సంస్ధల నుంచి రూ.26 వేల కోట్ల నిధులను అప్పురూపేణా సేకరించారు. ఇక నూతన రైల్వే లైనుకు పూర్తిగా నిధులను కేంద్రమే భరించనుండగా… ఇక గతంలో టీడీపీ అధికారంలో ఉండగా… ఇటు విజయవాడతో పాటుగా అటు విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు మార్గం సుగమం కాగా… ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు ఏకంగా డీపీఆర్ లు రూపొందాయి. కేంద్రం అనుమతి ఇవ్వడమే తరువాయి సదరు ప్రాజెక్టులు పట్టాలెక్కడం ఖాయమేనని చెప్పాలి.
2014లో టీడీపీ అధికారంలో ఉన్నా… నాడు కేంద్రంలో ఉన్న బీజేపీతో కొన్నిఅంశాల్లో విభేదాల కారణంగా ఏపీలో అనుకున్నంత మేర అభివృద్ధి పనులు సాగలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా బిన్నమనే చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ… తాను మెజారిటీ సీట్లు గెలవడంతో పాటుగా బీజేపీ, జనసేనలు కూడా గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలిచాయి. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం అందుకుని వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకున్నా… ఐదేళ్ల పాటు మోదీ అధికారంలో కొనసాగాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ఎంపీలు ఎన్డీఏలోనే కొనసాగాలి. ఈ కారణంగానే చంద్రబాబుకు మోదీ నుంచి ఎనలేని ప్రాదాన్యం లభిస్తోంది. ఇలా అడిగిందే తడవుగా ఏపీకి అన్నీ సమకూరి పోతున్నాయి. అమరావతికి రుణం కూడా కేంద్రం గ్యారెంటీ ఇచ్చి మరీ ఇప్పిస్తున్న తీరు ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.
2014లో అదికారంలోకి వచ్చినప్పుడే విశాఖ, బెజవాడ మెట్రోల గురించి చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్… దానిని పక్కనపడేశారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో అదికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి మెట్రో రైలు ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఎలాంటి హంగూాఆర్బాటం లేకుండానే చడీ చప్పుడు కాకుండా… కేవలం 4 నెలల్లో విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలు (డీపీఆర్)లను చంద్రబాబు సిద్ధం చేయించారు. ఈ నివేదికలను ఇప్పటికే కేంద్రం పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం పంపించేసింది కూడా. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి.
ఇక విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.. విజయవాడ మెట్రో రైలులో మొత్తంగా 3 కారిడార్లను ప్రతిపాదించినా… తొలి దశలో 2 కారిడార్లను మాత్రమే నిర్మించనున్నారు. ఈ కారిడార్లలో మొదటిది పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు కొనసాగుతుంది. ఇక రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు కొనసాగుతుంది. ఈ కారిడార్లకు రూ.25,130 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. ఇక విశాఖలో మొత్తం 4 కారిడార్లను ప్రతిపాదించగా… తొలి దశలో 3 కారిడార్లను మాత్రమే చేపట్టనున్నారు. వీటిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకుచ గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు, తాటిచెల్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు ఈ కారిడార్లు కొనసాగనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.17,232 కోట్ల మేర నిదులు అవసరం కానున్నాయి. ఇక ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు అసరమైన భూసేకరణకు మరో రూ.2,799 కోట్ల నిధులు అవసరముతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.