ఉత్తరప్రదేశ్, హత్రాస్ లో 19 ఏళ్ల యువతిపై పైశాచిక దాడి చేసిన ఘటనను సీబీఐకి అప్పగిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. ఈ కేసులో సీబీఐ విచారణ ద్వారా దోషులకు శిక్ష పడుతుందని జనసేన నమ్ముతోందని ఆ ప్రకటనలో పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ గళం విప్పాలని జనసేన ఆది నుంచి కోరుకుంటోందని తెలిపారు. అమ్మాయిల భద్రతకు ఈ సమాజం భరోసా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక వ్యవహారంలో జనసేన ఇదే తరహాలో పోరాడుతోందని వివరించారు. నాడు కర్నూలులో జనసేనాని పవన్ కల్యాణ్ కవాతు చేయడంతో ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించిందని, అయితే ఇంతవరకు సీబీఐ నుంచి ఈ కేసుపై అధికారిక ప్రకటన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్, హత్రాస్ లో 19 ఏళ్ల యువతిపై కొందరు దారుణానికి ఒడిగట్టారు. ఆ యువతి నాలుక కోసి, నడుం విరగొట్టారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఢిల్లీ, హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలవడంతో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై అత్యాచారం జరగలేదని ప్రకటించి ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. దీంతో సామాన్యుల నుంచి ప్రతిపక్షాలు, సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో యోగి ఈ కేసును సీబీఐకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.











