రాష్ట్రంలో కరోనా జోరుమీదుంది… లాక్‌డౌన్ అమలులో ఉంది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. నిత్యావసర సరుకులు దొరకకా జనం అల్లాడిన పరిస్థతి అప్పట్లో. అలాంటి సందర్భంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క నేనున్నానంటూ అభాగ్యులకు ఆపన్నహస్తం అందించింది. శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో లాక్ డౌన్ సమయంలో సీతక్క చేసిన సేవల గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారట. సీతక్కలాంటి ఎమ్మెల్యే మన పార్టీలో ఉండడం అందరికీ గర్వకారణమని కొనియాడారు. సీతక్క దేశంలోనే హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అని అన్నారట. పార్టీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్‌లో సీతక్క పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారన్నారు. పార్టీ పిలుపిచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆమెను రాహుల్ కొనియాడారు. అందరూ సీతక్కలా పార్టీ కోసం శ్రమించాలని రాహుల్ ఆమెకు కితాబిచ్చారు.
అందుకే సీతక్క అయ్యారు..
లాక్‌డౌన్ సమయంలో దాదాపు 40 రోజుల్లో ఏకంగా 300 గ్రామాలను చుట్టేసీ వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని, వారికి అవసరమున్న ఏవో నిత్యావసరుకులను ఇచ్చి అందరితో శెభాష్ సీతక్క అని పించుకున్నారు.
లాక్‌డౌన్ సమయంలో గిరిజనులకు ఎమ్మెల్యే సీతక్క చేసిన సేవలు అనిర్వచీయనం. కొండలు, కోనలు దాటి కాలి బాట కూడా లేని మారుమూల గ్రామాలకు వాగులు, వంకలు దాటుకుంటూ, కొంత దూరం ద్విచక్రవాహనంపై కూడా గిరిజనులను ఆదుకునేందుకు ముందుకు సాగారు. నెత్తిమీద, భుజాన సంచులు మోసుకుంటూ, చేతిలో తన చెప్పులు పట్టుకుని నీళ్లల్లో నడుచుకుంటూ నిత్యావసర సరకులు, కూరగాయలను అక్కడి గిరిజన కుటుంబాలకు పంచిపెట్టారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి సీతక్క దినచర్య దాదాపుగా ఇదే. తన నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలకు వెళ్తూ ఏ సదుపాయాలూ అందని వారికి బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు, ఉప్పు, చింతపండు, కారం వంటి నిత్యవసరాలను ఆమె అందించారు. తమ నియోజకవర్గ ప్రజల కోసం ఇలా ఆలోచించేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రతిఫలం ఆశించని వారు మాత్రమే ఇలా సేవా మార్గాన్ని ఎంచుకుంటారని సీతక్కను చూస్తే అర్ధమవుతోంది.
ఎప్పుడూ ప్రజలపక్షమే..
సీతక్క ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తర్వాత పోలీసులకు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో చేరి రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీతక్క ఎప్పుడూ ప్రజాసమస్యలపై పోరాటంలో ముందుంటోంది. ప్రజల పక్షాన నిలుస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ… సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో గో హంగర్ గో అనే ఛాలెంజ్ కూడా ప్రారంభించి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతుంది కాబట్టే రాహుల్ చేత శెభాష్.. సీతక్క అని పించుకున్నారని తన అభిమానులు అంటున్నారు.











