కరోనా విషయంలో ఏ నాయకుడు ఉపన్యాసం ఇచ్చినా సరే.. ఫ్రంట్ లైన్ వారియర్లను పదేపదే పొగుడుతుంటారు. డాక్టర్లు, పోలీసులు, తదితర రంగాలకు చెందిన సిబ్బంది సేవలు నిరుపమానమైనవి. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏమైంది? రాష్ట్ర వ్యాాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు సేవలు నిలిపేసే వరకు పరిస్థితి ఎందుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. ఎందుకు స్పందించలేదు? వీరి ఆవేదనను ఎందుకు సకాలంలో అర్థం చేసుకోలేదు?
జూనియర్ డాక్టర్లు నాలుగు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ వారు అడుగుతున్న కోరికలు ఏమిటి? నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వాలి.. డే స్కాలర్స్ కు ఉచిత వసతి ఏర్పాటు చేయాలి… బీమా సౌకర్యం ఉండాలి.. స్టయిఫండ్ పెంచాలి. ఇవేవీ అంత సీరియస్ పెద్ద డిమాండ్లు కావు. నాలుగురోజులుగా జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి.. తమ విన్నపాలు తెలియజెప్పుకుంటూనే… విధులకు హాజరువుతున్నప్పటికీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో సోమవారం నుంచి ఓపి, వార్డు సేవలను నిలిపేస్తున్నట్టుగా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఆరోగ్య పరంగా అత్యవసరమైన ఇప్పటి పరిస్థితుల్లో.. అత్యవసర సేవలకు మాత్రం యథాతథంగా హాజరు కావాలని నిర్ణయించారు.
కరోనా పై జరుగుతున్న యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా డాక్టర్లకు మనం అత్యధికంగా రుణపడిపోతున్నాం. ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న సేవలు నిరుపమానమైనవి. ఏం చేసినా రుణం తీర్చుకోలేనివి. అలాంటి డాక్టర్ల కనీస డిమాండ్లను వినిపించుకునే ఓపిక ప్రభుత్వానికి లేకపోవడం చిత్రంగా కనిపిస్తోంది. వారు నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళనల డోసేజీ పెంచారు. కోవిడ్ ఎమర్జన్సీ సేవలకు మాత్రం నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు.
కేవలం ప్రజలు, రోగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మాత్రమే అత్యవసర సేవలు కొనసాగిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు కార్తీక్ కూడా ప్రకటించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే కోవిడ్ సేవలు, ఎమర్జన్సీ సేవలు నిలిపివేస్తాం అని కూడా హెచ్చరించారు. పరిస్థితి ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఉపేక్షిస్తూనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోవిడ్ కు సంబంధించిన సభల్లో డాకర్ల సేవలను పొగడ్డం మాత్రమే కాదు.. వారి సమంజసమైన కోర్కెలను తక్షణం పరిష్కరించడం కూడా చాలా అవసరం.