కే.రామచంద్రమూర్తి అలిగారు. సీనియర్ జర్నలిస్టుగా దశాబ్దాల అనుభవం ఉన్న కే.రామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాలసీల సలహాదారుగా గతంలోనే నియమించింది. హెచ్ఎంటీవీ మేనేజింగ్ డైరక్టర్‌గా రాజీనామా చేసిన రామచంద్రమూర్తి అక్కడి నుంచి సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు సంవత్సరంపైనే ఆ బాధ్యతలు పర్యవేక్షించిన రామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ సలహాదారు పదవి కట్టబెట్టారు.
ఇది జరిగి ఏడాది కూడా కాకుండానే ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లంను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. ఈ హఠాత్తు నిర్ణయం వెనుక ఆయన అలకలే కారణమని తెలుస్తోంది. గతంలో తన అభీష్టానికి వ్యతిరేకంగా పలు పత్రికల యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రామచంద్రమూర్తి తన ఎడిటర్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది ఆయన వ్యక్తిత్వమనే వారూ ఉన్నారు. ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన కీలకమైన స్ధానంలో ఉన్న రామచంద్రమూర్తి ఆ పదవికి రాజీనామా చేయడం కూడా గతంలోలాగే తన అభీష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా జరిగిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
తాను ఆ పదవి తీసుకోవడానికి కారణం ప్రజలకు సేవ చేసేందుకేనంటూ గతంలో ఓ పత్రికతో జరిగిన ప్రకటనల సంవాదంలో రామచంద్రమూర్తి స్పష్టం చేశారు. వివాదాలకు దూరంగా, వృత్తి పట్ల అంకితభావంతో ఉండే రామచంద్రమూర్తి అలక వెనుక పెద్ద కారణమే ఉండి ఉండవచ్చునని అంటున్నారు. రాజీనామా లేఖలో ఎలాంటి కారణాలు పేర్కొన్నారో కూడా తెలియకపోయినా ఏదో బలమైన కారణమే ఆయన రాజీనామా నిర్ణయానికి కారణమని అంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు విధాన నిర్ణయాలను ప్రకటించింది. వాటి ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఈ విధాన నిర్ణయాల పట్ల రామచంద్రమూర్తి సలహాదారుగా వ్యవహరించలేకపోయారా అని కూడా వాదనలు వస్తున్నాయి. ఆయన సలహాలు, సంప్రదింపులు లేకుండానే ఆ నిర్ణయాలు ప్రకటించడంతో రామచంద్రమూర్తి అలిగారా అని కూడా వాదనలు వస్తున్నాయి. సలహాదారు పదవిలో నియమితులై దాదాపు ఏడాది కావస్తుండగా.. ఇప్పటిదాకా ఆయన సలహాకోసం ఒక్క ప్రభుత్వ ఫైల్ కూడా రాలేదని.. ఆ కారణంగానే కినుక వహించి రాజీనామా చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.











