ఏపీలో కూటమి సర్కార్ సూపర్-6 హామీల్లో భాగంగా అమలు చేస్తున్న తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. స్కూల్స్ ఓపెన్ అయిన మొదటి రోజు నుంచే తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా పథకం అమలు చేస్తున్నారు.
కడప జిల్లాలోని ఓ ఉమ్మడి కుటుంబంలో 12 మందికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద లక్షా 56 వేల రూపాయలు ఖాతాలో జమ చేసింది. దీంతో సదరు కుటుంబం ఆనందాన్ని పంచుకుంటూ..కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గతంలో వైసీపీ హయాంలో తమకు ఒక్క చిన్నారికి మాత్రమే అమ్మ ఒడి పడిందని..ఇప్పుడు ఎంత మంది ఉన్నా డబ్బులు అందాయని ఆ కుటుంబం స్పష్టం చేసింది. దీంతో పిల్లల చదువులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతాయని, వారి భవిష్యత్తు బాగుంటుందని ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా..శనివారం నాటికి దాదాపు 67 లక్షల మంది ఖాతాల్లో నగదు జమైంది. మరికొందరికి వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇక కొన్ని ఫ్యామిలీల్లో ఒక్క విద్యార్థికి పడి మరో విద్యార్థికి డబ్బులు జమ కాలేదు. దీంతో పేమెంట్ చెక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారులు ఆధార్ వివరాలు, OTP ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఇప్పటివరకూ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని వేల కుటుంబాలకు ఒకేసారి ఏ పథకం కింద లబ్ధి చేకూరలేదు. జగన్ గత ఐదేళ్లలో అమ్మ ఒడి కింద ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే పథకం వర్తింప జేశారు. కూటమి సర్కార్ మాత్రం పిల్లల భవిష్యత్ దృష్ట్యా అందరిని అర్హులుగా చేర్చింది. కొన్ని కుటుంబాలకు జగన్ గత ఐదేళ్లలో వేసిన సొమ్ము..ఈ సారి ఒకే విడతలో జమ అయింది. దీంతో తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.