దుబ్బాక ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఆల్ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ మద్దతుతో దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక పోటీచేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఖరారు కాక ముందు నుంచే కత్తి కార్తీక ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్నారు. బహుజన బిడ్డగా తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే.. దుబ్బాక నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కౌంటర్లతో కత్తి దూస్తున్న కత్తికార్తీక..
ఓ ప్రముఖ ఛానెల్లో నిర్వహించిన బిగ్‌బాస్ షో ద్వారా ఫేమస్ అయిన ఈమె రాష్ట్ర ప్రజలకు దాదాపు సుపరిచితురాలే. అయితే ఈ ఫేమ్‌ను ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాబట్టాలని దుబ్బాక నుంచి పోటీ చేస్తున్నది. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఈ యాంకర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓవైపు మంత్రి హరీష్ రావు, మరోవైపు బిజెపి నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి బడా నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీలకు సమానంగా కత్తి కార్తీక కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ఫాలోవర్లతో ఊరు వాడా చుట్టేస్తున్నారు. తనను ఓటు వేసి గెలిపిస్తే ఎవరూ చేయలేని విధంగా దుబ్బాక నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని హామీలు కురిపిస్తున్నారు. సిద్ధిపేటను అభివృద్ధి చేసిన తెరాస దుబ్బాకను ఎందుకు మరిచిపోయిందని అధికార పార్టీకి ఘాటుగా కౌంటర్లను కురిపిస్తోంది.
దుబ్బాకను మరిచిన పాలకులు..
కత్తి కార్తీక సిద్దిపేట జిల్లా వాసి. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందినది. గత పాలకుల పరిపాలనలో దుబ్బాక నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉన్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధి చెందిందని, దుబ్బాక నియోజకవర్గం ఎందుకు అంతలా అభివృద్ధి చెందలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. తన సామాజికవర్గానికే కాదు, ఇతరులకు ఏ సమస్య ఉన్నా తాను వెంటుండి పోరాడుతానని కార్తీక చెప్తున్నారు. ఎన్నికల్లో తన పోటీ ప్రత్యర్థులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనని ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్నారు. తమకు మెజార్టీ తగ్గుతుందేమోనని తెరాస, స్వల్ప మెజార్టీతో ఓడిపోతే ఎలానని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పోటీ చేసినా తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమకే పడతాయని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి దుబ్బాక ప్రజల తీర్పు ఎలా ఉంటుందో.