(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అమరావతి రాజధానిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమరావతి రాజధానిలో అసెంబ్లీ కూడా వద్దని, దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సూచించానని కొడాలి నాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. దీనిపై సీఎం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందాం అని జగన్ అన్నారనేది ఆ ప్రకటన సారాంశం.
అమరావతి రాజధాని పరిధిలో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే, రైతులు వ్యతిరేకించారని, అందుకే ఇలాంటి ప్రాంతంలో అసెంబ్లీ కూాడా వద్దని సీఎంకు సూచించినట్టు మంత్రి కొడాలి ఆ ప్రకటనలో వెల్లడించారు. తాజా వ్యాఖ్యలు కొడాలి నాని మనసు నుంచి వచ్చినవిగా కనిపించడం లేదు. వైసీపీ అధిష్ఠానం కొడాలిలో ఈ వ్యాఖ్యలు చేయించిందని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు.
మూడు రాజధానులు తూచ్.. విశాఖ ఒక్కటే రాజధాని
వైసీపీ సర్కార్ మూడు రాజధానులు ప్రకటన చేసినా ప్రజలకు నమ్మకం కలగడం లేదు. అసలు అమరావతిలో అసెంబ్లీ కూడా ఉంచడం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని తెలుస్తోంది. అయితే ఒకేసారి రాజధాని విశాఖ అని ప్రకటిస్తే ప్రజల్లో వ్యతిరేకతతోపాటు, ఉన్నత న్యాయస్థానాల్లో కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పాలనా వికేంద్రీకరణ, అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు 3 రాజధానులని సమర్ధించుకునేందుకే అసెంబ్లీలో ఇలా ప్రకటించారని తెలుస్తోంది. పాలనా రాజధాని విశాఖకు తరలిన తరవాత అక్కడ కొంత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే, ఆ తరవాత అమరావతిని రాజధానిని శాశ్వతంగా సమాధి చేయాలని భావిస్తున్నారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.
అక్కడే 50 వేల మందికి అందుకేనా?
అమరావతి రాజధాని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. మూడు రాజధానుల ప్రకటనతో ఆ ప్రాంతంలో వైసీపీ ప్రభ కొడిగడుతోంది. కనీసం 29 గ్రామ పంచాయితీల్లో ఒక్కటి కూడా గెలుచుకునే అవకాశం లేదు. అందుకే అక్కడ గ్రామ పంచాయితీలను అమరావతి అభివృద్ధి సంస్థ పేరుతో విలీనం చేశారు. అంటే అక్కడ గ్రామాలకు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండవన్నమాట. ఇక రాజధాని భూముల్లో సమీప పట్టణంలోని విజయవాడ, మంగళగిరి, తెనాలి, దుగ్గిరాల నుంచి 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారిని అక్కడకు తరలిస్తే, వారంతా వైసీపీ ఓటు బ్యాంకుగా మారతారని పెద్దలు భావించారు. ఇందులో కూడా తెలివిగా వ్యవహరించారు. రాజధానిలో పేదలకు ఇచ్చే సెంటు భూమి సగం మంది తాడికొండ, మరి కొంత మంది మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రాజధాని రైతులు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్ధానాలు స్టే ఇచ్చాయి. దీంతో వైసీపీ పెద్దల కుట్రకు తెరపడింది.
మంత్రి కొడాలి తాజా వ్యాఖ్యలు దేనికి నిదర్శనం
మూడు రాజధానులు దేశంలో ఎక్కడా లేవు. కేవలం హైకోర్టు ఉంటే దానికి రాజధాని అనరు. దేశంలో 9 రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానుల్లో లేవు. కానీ హైకోర్టు పెడితే ఒక రాజధాని అని, అది న్యాయరాజధాని అని రాయలసీమ వాసులను మోసం చేయాలని చూశారు. కానీ కర్నూలు వాసులు రాజధాని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు, హైకోర్టు బెంచ్ లు కాదు. అందుకే ప్రభుత్వం మంత్రి కొడాలి నానిని రంగంలోకి దింపి అమరావతిలో అసెంబ్లీ కూడా వద్దు అని ప్రచారం చేయిస్తున్నారు.
రాజధాని ప్రజలను మానసికంగా సిద్దం చేస్తున్నారన్నమాట. ఇక అమరావతి రాజధానిలో అసెంబ్లీ కాదు కదా, ఇక్కడ నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దంగా లేరని సమాచారం. అందుకే మంత్రి కొడాలి నానికి అమరావతి రాజధాని వ్యవహారం అప్పగించారు. ఇది ఒక్క కొడాలి నాని వ్యాఖ్యలతో పోదు. రాబోయే కొద్ది రోజుల్లో మరికొంత మంది మంత్రులతో కూడా ఇవే వ్యాఖ్యలు చేయిస్తారు. ఈ విషయాన్ని అధ్యయనం చేయడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసినా ఆశ్చర్యం లేదు. ఆ తరవాత ఒకే రాజధాని. అదే విశాఖ అని ప్రకటించే అవకాశం ఉంది.











