తెలంగాణలో బాధితుల పరామర్శకూ అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను ఏకంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపింది. బాధితులను పరామర్శించేందుకు కూడా విపక్షాలకు చెందిన నేతలను అనుమతించరా? అంటూ రఘునందన్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్న సాగర్ ముంపు బాధితుడి ఆత్మహత్య
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ కు సంబంధించి ముంపు బాధితులకు పరిహారం విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తాయి. ఈ క్రమంలో మల్లన్న సాగర్ ముంపు బాధితులమైన తమకు అన్యాయం జరిగిందని, దీనిపై న్యాయం చేయాలని ఎన్ని సార్లు వినతి పత్రాలు సమర్పించినా న్యాయం జరగలేదన్న ఆవేదనతో మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట మండలం వేముల ఘాట్ కు చెందిన మల్లారెడ్డి… మల్లన్న సాగర్ ముంపులో తమ ఇళ్లు, పొలాలు పోయాయని, అయితే తమకు పునరావాసం విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే మల్లారెడ్డి వినతిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.
పరామర్శకూ వెళ్లనివ్వరా?
మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రఘునందన్ రావును అడ్డుకున్నారు. అయితే పోలీసుల వలయాన్ని తెంచుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించిన రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే కూడా అడ్డుకుంటారా? అని ఆయన పోలీసులను నిలదీశారు. మల్లారెడ్డిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కూడా రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉదాశీన వైఖరి కారణంగానే మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
Must Read ;- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి వివరాలు సేకరించాం : బండి సంజయ్ వ్యాఖ్యలు











