కరోనా వచ్చాక ఓటీటీ ప్రాధాన్యం పెరిగిందన్నది కాదనలేని వాస్తవం. కానీ ఓటీటీలో బూతుకు ఎక్కువ చోటు కల్పించడం విమర్శలకు తావిచ్చింది. దీని నియంత్రణకు ప్రభుత్వం పూనుకుని తగిన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సెన్సార్ ఉంటే నిర్మాణాలు తగ్గిపోతాయన్న అభిప్రాయం కూడా వ్యక్త మవుతోంది. ముఖ్యంగా ఓటీటీ వ్యాపారం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుందున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటీటీ ప్రాధాన్యాన్ని చిత్ర పరిశ్రమ గుర్తించింది. పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఓటీటీ నిర్మాణాల వైపు అడుగులు వేస్తున్నాయి. వ్యాపార విస్తరణకు కూడా ఇది ఉపయోగపడింది. ఒకవేళ థియేటర్లు ప్రారంభమైనా ఓటీటీ నిర్మాణాలకు వెనుకాడటం అనేది కూడా ఉండే అవకాశం లేదు. ఇప్పటికే అనేక నిర్మాణాలు ఊపందుకున్నాయి. తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగే అవకాశం ఉండటమే దీనికి కారణం.
స్వీయ నియంత్రణ సాధ్యమా?
సెన్సార్ షిప్ విషయానికి వస్తే స్వీయ నియంత్రణ సాధ్యమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ద్వంద్వార్థాలు, మితిమీరిన శృంగారం, అంగాంగ ప్రదర్శనలు లాంటివి ఓటీటీకి మంచి మసాలా అందిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఇవే రూపొందుతున్నాయి. సడన్ గా వీటికి సెన్సార్ షిప్ విధించడంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒక విధంగా ఓటీటీ తెలుగులో ప్రారంభ దశలో ఉంది. ప్రేక్షకుల్లోకి మరింతగా దూసుకుపోడానికి ఏదో ఒక మార్గం అవసరం. సెన్సార్ నిబంధనల వల్ల నిర్మాణ పరమైన ఆటంకాలు తప్పేలా లేవు.
సెన్సార్ షిప్ తప్పనిసరి అని అనేక విభాగాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. భవిష్యత్తులో సెన్సార్ విధానం అమలైతే మాత్రం ఓటీటీకి కొంత ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెన్సార్ షిప్ అనేది నిర్మాణ స్వేచ్ఛను తగ్గిస్తుందని, ఓటీటీ వ్యాపారం మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేది సమాచారం.
Must Read ;- బాబాయ్ అబ్బాయ్ కాంబో ఖాయమైంది.. !