వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరలా తెరలేపింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను వైసీపీలోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ కార్యక్రమాన్ని మంత్రి కొడాలికి అప్పగించినట్టు సమాచారం. ఒకప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణ ఎప్పటి నుంచో విశాఖలోనే సెటిల్ అయ్యారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
విశాఖలో కమ్మ సామాజికవర్గం నుంచి గట్టి నేత వైసీపీలో ఉంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నెగ్గడం సులువవుతుందని వైసీపీ పెద్దలు బావిస్తున్నారట. వెలగపూడి రామకృష్ణను వైసీపీలోకి తీసుకు వస్తే ఇక ఆ జిల్లాలో టీడీపీకి కమ్మ సామాజికవర్గం నుంచి అండగా నిలిచేది మూర్తి కుటుంబం మాత్రమే. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీలో చేరడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. వైసీపీ మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి, గంటా రాకను తీవ్రంగా అడ్డుకుంటున్నారని సమాచారం. దీంతో చేసేది లేక గంటా వేచి చూసే ధోరణిలో ఉన్నారని అందరికీ తెలిసిందే.
కొడాలిని ఎందుకు రంగంలోకి దింపారు
వెలగపూడి రామకృష్ణతో కొడాలికి అనుబంధం ఉంది. వారిద్దగా అసెంబ్లీ కారిడార్ లో పిచ్చాపాటీ మాట్లాడుకోవడంతోపాటు, ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో కొడాలికి అప్పగించారని తెలుస్తోంది. మంత్రి కొడాలి కూడా టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. వారిలో ఇద్దరు కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలే. అందుకే టీడీపీని దెబ్బ కొట్టాలంటే కమ్మ సామాజికవర్గం వారి నుంచి తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలని వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణను వైసీపీలోకి తీసుకువచ్చే ఆపరేషన్ చురుగ్గా సాగిస్తున్నారట.
వెలగపూడి రామకృష్ణ పార్టీ మారుతాడా?
వెలగపూడి రామకృష్ణ ఖచ్చితంగా పార్టీ మారుతారని ఇప్పుడే చెప్పలేం. అలాగని టీడీపీలోనే ఉంటాడని కూడా చెప్పే పరిస్థితి లేదు. కొంత కాలంగా వెలగపూడి రామకృష్ణ విశాఖలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై కొంత అనుమానాలు వస్తున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి కూడా సరైన నేత లేరు. వెలగపూడి రామకృష్ణ వైసీపీలోకి వస్తే 2024లో ఆ సీటు అతనికే రిజర్వు చేస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందట. గతంలో వెలగపూడి వైన్సు వ్యాపారం నిర్వహించుకునే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైన్ షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దీంతో ఆయన వ్యాపారాలు మూతపడ్డాయి. అందుకే ఆయన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కొన్ని కాంట్రాక్టులు కూడా అప్పగించేలా చూస్తామని మంత్రి కొడాలి హామీ ఇచ్చారట. అంతేకాదు 2024 ఎన్నికలకు పార్టీ నుంచి రూ.10 కోట్లు ఫండ్ కూడా ఇప్పించి గెలిపించుకునే బాధ్యత మేం తీసుకుంటామని వెలగపూడికి అన్ని విధాలా కొడాలి భరోసా ఇచ్చారని సమాచారం.
విశాఖలో టీడీపీని బలహీనపర్చడమే ప్రధాన వ్యూహం
విశాఖలో టీడీపీ బలంగా ఉంది. అక్కడి నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఎంపీ సీటు వైసీపీ గెలుచుకున్నా సిటీలో మాత్రం టీడీపీ పట్టు కొనసాగుతూనే ఉంది. ఇక గంటా టీడీపీ నుంచి గెలిచినా ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన మనసంతా వైసీపీలోనే ఉంది. ఆయన రాకను ఆ పార్టీలోని ఆ ఇద్దరు తీవ్రంగా వ్యతిరేకించడంతో గంటాను వైసీపీలో చేర్చుకునే పని వాయిదా పడుతూ వస్తోంది. ఇక విశాఖ తూర్పు నుంచి వెలగపూడిని వైసీపీలోకి లాగేస్తే నగరంలో టీడీపీకి సగం బలం తగ్గిపోయినట్టే. ఆ తరవాత కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం కూడా తేలికవుతుంది. ఇక విశాఖను రాజధానిగా ప్రకటించడంతో ఆ ప్రాంతంలో సహజంగానే వైసీపీ పట్టు పెరిగిందనే చెప్పవచ్చు. విశాఖను రాజధానిగా ప్రకటించిన తరవాత కూడా పొరపాటున కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పరువు పోతుందని ఆ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. అందులో భాగంగాగే ఆపరేషన్ ఆకర్ష్ 2 ప్రారంభించారని తెలుస్తోంది. ఇదే జరిగితే విశాఖలో టీడీపీ పతనం ప్రారంభం అయినట్టే.











