మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇదే జరిగితే అటు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగనుండగా, సొంత అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు శుక్రవారం తిరుమలలో ప్రకటించారు. 2018ఎన్నికల ఫలితాల తరువాత ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసుకూడా ఇచ్చి వివరణ అడిగింది. తరవాతి కాలంలో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తాజాగా వ్యాఖ్యలు చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని వ్యాఖ్యానించారు. తరువాత కాంగ్రెస్‌లోనే కొనసాగిన రాజగోపాల్ రెడ్డి కొవిడ్ సమయంలోనూ భారీగానే సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు అండగా ఉన్నారు. దాదాపు రూ.4కోట్ల విలువైన నిత్యవవసరాలు పంపిణీ చేశారు. మరోవైపు తెలంగాణ పీపీసీ రేసులో తన సొంత అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేసులో ఉన్నా టీపీపీసీ విషయంపై కొన్నాళ్లుగా రాజగోపాల్ రెడ్డి నోరు విప్పలేదు. టీపీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుందనే అంశంపైనా తన అభిప్రాయం సూటిగా చెప్పలేదని సమాచారం. ఇక తాజాగా చేసిన రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని, తాను బీజేపీలోకి వెళ్తానని వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా కలిసే ఉంటామని వ్యాఖ్యానించారు.
తాజాగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణం అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన టీపీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించడం వ్యూహాత్మకమా లేక నిర్ణయాలు జరిగిపోయాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. టీపీసీసీ రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఇప్పటికే ఆశావహులను పిలిపించి చర్చించిందని, సర్ది చెప్పిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి, ఒకరికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యత్వం ఇస్తారని కూడా చెబుతున్నారు.
తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి పునరాలోచనలో పడుతుందని చర్చ నడుస్తోంది. అదే జరిగితే.. టీపీపీసీ అధ్యక్ష రేసులో ఆ రెండు పేర్లే అధిష్టానం పరిశీలనలో ఉంటే.. రేవంత్ కి రాజగోపాల్ రెడ్డి లైన్ క్లియర్ చేసినట్టేనన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి కాకున్నా.. మరో వ్యక్తికి ఇస్తే వేరే సంగతి. అలా కాకుండా ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ ఇస్తే.. పార్టీ కేడర్ కి నెగెటివ్ మెస్సేజ్ వెళ్తుందన్న చర్చ నడుస్తోంది. మరో అంశాన్ని పరిశీలిస్తే.. టీపీసీసీ విషయంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ క్లారిటీ ఇచ్చి ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రకటన వచ్చి ఉంటుందని మరో చర్చకూడా నడుస్తోంది.
ఆర్థిక అంశాలూ కీలకమే..
వాస్తవానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ దశాబ్దాలుగా కలిసి ఉన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా విడిపోలేదు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సేవా కార్యక్రమాల్లోనూ వీరు కలిసే పాలుపంచుకుంటారు. ఆర్థికంగానూ ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వెంకట్ రెడ్డితో పోల్చితే.. రాజగోపాల్ రెడ్డి ఆర్థిక అంశాల్లో కీలకంగా ఉంటారని చెబుతున్నారు. కంపెనీల లావాదేవీలుకూడా ఆయనే చూసుకుంటారు. కొన్నాళ్లుగా రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని సమాచారం. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తే.. వెంకట్ రెడ్డికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. మొత్తంమీద కొత్త సంవత్సరంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి ప్రకంపనలు రేపాయని చెప్పవచ్చు.











