ఎల్ఆర్ఎస్ ఫీజు…ప్లాట్ల ధరలో సగం ఉన్నాయంటూ ప్రజల నుంచి వచ్చిన విమర్శలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. 131 జివోను సవరించనున్నట్లు మంత్రి కెటిఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. సవరించిన జివోను రేపే(గురువారం) విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వేలాది మందికి ఊరట పొందనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన జీవో ప్రకారం ఫీజులు అధికంగా ఉన్నాయంటూ అసలు ఎల్ఆర్ఎస్ కట్టాలా వద్దా అనే ఆందోళనలో జనం ఉన్నారు. ఈ క్రమంలో ఫీజు అంశాన్ని సవరించడమనేది హర్షించదగ్గ విషయమని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా విడుదల చేసే జీవో ప్రకారం తమపై ఫీజుల భారం తగ్గనుందని పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్నది కాబట్టే మొన్న విడుదల చేసిన 131 జీవోను సవరిస్తామన్నారు. గతంలో ఎప్పుడైతో వారు రిజిస్ర్టేషన్ చేసుకున్నారో వాటి వాల్యూకు అనుగుణంగానే ఫీజులు కట్టేలా సవరించిన జీవోను గురువారం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రిజిస్ర్టేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి….
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా 2015లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను నిర్ణీత ఫీజు కట్టి(ఎల్ఆర్ఎస్) ఆ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేలా ఈ పథకాన్ని రూపొందించింది. అయితే దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చి రూ.వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరేలా చేసింది. మళ్లీప్పుడు మరొకసారి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
అనధికారిక లే అవుట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని మంత్రి కేటీఆర్ ఇటీవలే చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ని సద్వినియోగం చేసుకుంటే యాజమానులు భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు.
వచ్చే అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వర్తించదని మంత్రి స్పష్టంచేశారు.











