‘ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!’ అనే కోతి కథ మాదిరే సినిమాల పరిస్థితి తయారైంది. థియేటర్లు పోయి వాటి స్థానంలో ఓటీటీ వచ్చి చేరింది. ఒకవిధంగా ఓటీటీ అనేదే నిర్మాతలకు సేఫ్ గేమ్ అని అనిపిస్తోంది. ఇటీవల రెండు మూడు సినిమాలు గత్యంతరం లేనిపరిస్థితుల్లో ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలు మూడూ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇవే సినిమాలు గనుక థియేటర్లలో విడుదలై ఉంటే ఇటు నిర్మాతలు, అటు పంపిణీదారులు నిండా మునిగిపోయేవారు. ముఖ్యంగా పెంగ్విన్, సడక్ 2, వి సినిమాల గురించి చెప్పుకోవాలి.
మహానటి కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఈ సినిమా మీద కూడా అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తీరా అమెజాన్ లో ఇది విడుదలయ్యాక చూసిన వారంతా నిరాశ పడ్డారు. బాలీవుడ్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సీక్వెల్ సినిమా ‘సడక్ 2’ విషయంలోనూ అదే జరిగింది. సంజయ్ దత్, ఆలియాభట్ లతో బాలీవుడ్ దిగ్గజం మహేశ్ భట్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఓటీటీలో పరాజయాన్నే చవిచూసింది. ఇక తాజాగా తెలుగులో నాచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఆరు నెలల నుంచి సినిమాలేవీ విడుదల కాకపోవడంతో అందరూ ఈ సినిమా చూడటం కోసం ఉబలాటపడ్డారు. తీరా విడుదలయ్యాక అందరికీ నిరాశే మిగిలింది.
రేటింగులు ఏమన్నాయి?
సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమాలకు దక్కిన రేటింగులు చూస్తే దారుణంగా ఉన్నాయి. పెంగ్విన్, వి సినిమాలకు దక్కిన రేటింగులు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. 5 పాయింట్లకు 2 లేదా 2.5 మధ్య రేటింగులు ఇచ్చాయి. సడక్ 2 పరిస్థితి అయితే మరీ దారుణం. ఐఎండీబీలో ‘సడక్ 2’ అట్టడుగు స్థాయిలో ఉంది. దీనికి 10 పాయింట్లకు కేవలం ఒకే ఒక పాయింట్ దక్కింది. ఐఎండీబీలో పెంగ్విన్ కు 4.6 పాయింట్లు దక్కితే నాని ‘వి’కి మాత్రం 7.3 పాయింట్లు దక్కాయి. ఇది వి సినిమాకి ఊరటనిచ్చే అంశం. పాతచింతకాయ పచ్చడి లాంటి రివెంజ్ డ్రామా అందరినీ పూర్తిగా నిరాశ పరిచింది. ఈ మూడు సినిమాలు థియేటర్లలో గనుక విడుదలై ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది. అందుకే ఓటీటీ అనేది సేఫ్ గేమ్ అనేది అందరికీ అర్థమవుతోంది. థియేటర్లలో చూస్తే వచ్చే ఫీలింగ్ ఒక్కటే ఆడియన్స్ మిస్సవుతున్నారు… మిగతాదంతా సేమ్ టు సేమ్.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఓటీటీకి సినిమాని అమ్మితే మాత్రం నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లో ఉంటారు. అలాకాకుండా లాభాల్లో వాటా పద్ధతిలో పద్దతిలో సినిమా ఇస్తే మాత్రం నిర్మాత నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు విడుదలైన మూడు సినిమాలను అమెజాన్ కు కొన్ని షరతులతో అమ్మినట్లు తెలుస్తోంది. వి సినిమాను దాదాపు 33 లక్షలకు ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమాలు అటో ఇటో అయినా అమెజాన్ కు రెగ్యులర్ చందాదారులు ఉంటారు కాబట్టి ఆ సంస్థ మీద పెద్దగా భారం పడదు. ఈ సినిమాలను తీసుకోవడం ద్వారా అమెజాన్ సంస్థ పెద్దగా లాభపడేది ఏమీ ఉండదు.
నాని వి సినిమా విషయానికి వస్తే నిర్మాత దిల్ రాజుకు ఇది కలిసి వచ్చిన అదృష్టం అనే చెప్పాలి. ఇదే సినిమాని థియేటర్ లో గనుక విడుదల చేసి ఉంటే మాత్రం ప్రస్తుతం ఉన్న టాక్ కి రెండో ఆట నుంచే కలెక్షన్స్ మీద ప్రభావం పడేది. కరోనా అనేది ఆయనకు వరంగా పరిణమించింది. ఈ సినిమా ఫలితాన్ని ముందుగా అంచనా వేశాకే ఓటీటీకి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే వి సినిమా కన్నా ముందే విడుదల కావలసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని థియేటర్లలో విడుదల చేయటానికే ఆ నిర్మాతలు ఇష్టపడుతున్నారు.
ఇలాంటి ఫలితాలు వస్తుంటే ఓటీటీ సంస్థలు కూడా సినిమాలను ఇంత పెద్ద మొత్తం వెచ్చించి విడుదల చేస్తాయా అన్నది అనుమానమే. ఓ పెద్ద హీరో సినిమా తెలుగులో ఓటీటీ ద్వారా విడుదలవడం ఇదే మొదటి సారి. ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడైనా ఇతర హీరోలు ఓటీటీ విడుదలకు ముందుకు వస్తారా రారా అన్నది కీలక అంశం. 200 దేశాల్లో ఓటీటీ ద్వారా వి సినిమా విడుదలైంది. నాని తన మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులకు ప్రివ్యూ థియేటర్ లో షో వేసుకునే ఏర్పాటుచేసుకున్నారు. వి సినిమా ట్రైలర్ కు 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తొలిరోజు సినిమాను చూసిన వారి సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉంది.