మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ .. తెలంగాణ ప్రజలకు ఒక కొత్తది కాని ముచ్చటను గట్టిగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదని ఆయన సెలవిచ్చారు.
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన నియోజకవర్గంలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మునిసిపాలిటీకి మంజూరైన ట్రాక్టర్లను ఆయన ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా.. నియోజకవర్గానికి సంబంధించి.. తాను ముందు ముందు ఏం అభివృద్ధి పనులు చేయబోతున్నానో ఏకరవు పెడుతూ.. వాటికోసం మంత్రి కేటీఆర్ ను ఆల్రెడీ కలిసి విన్నవించిన సంగతిని ప్రజలకు నివేదించారు. ఈ క్రమంలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని, వచ్చే ఏడాది మార్చిలోగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా రెడ్యనాయక్ ప్రకటించారు.
మళ్లీ చర్చోపచర్చలు..
కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా వారసత్వ పగ్గాలు అప్పగించేందుకు ముహూర్తం వెతుకున్నట్లుగా చాలా రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు సాగినంత కాలం ఆ పర్వం ముగియగానే కేటీఆర్ కు పట్టాభిషేకం అనే పుకార్లు వినిపించాయి. దుబ్బాక ఓటమి తర్వాత.. కేటీఆర్ కు మరింత లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన స్వయంగా పూనిక వహించిన గ్రేటర్ లో కూడా పార్టీ చతికిలపడింది.
ఇక సీఎం పదవి పట్టాభిషేకం గురించి ఎవ్వరూ మాట్లాడ్డం మానేశారు. ఇలాంటి సమయంలో.. రెడ్యానాయక్ మాటలతో మళ్లీ చర్చ మొదలవుతోంది. ఇదిగో అదిగో అయిపోతారు అనడం మాత్రమే కాదు.. మార్చిలోగా ముఖ్యమంత్రి అవుతారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకటించడం విశేషమే.
Must Read ;- ఆ హామీలు ఏమయ్యాయి కేటీఆర్ సార్?











