పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ ఓవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటరిచ్చారు. తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఇద్దరు మహనీయుల సమాధులను కూల్చి వేయాలని ఎంఐంఎ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు సమాజానికి సేవలందించారని కేటీఆర్ అన్నారు. ఈ ఇద్దరు నాయకులు కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయులని పేర్కొన్నారు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్థకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులు, గొప్ప నాయకులపై అక్బరుద్ధీన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని ఆయన తెలిపారు.
ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2
— KTR (@KTRTRS) November 25, 2020
దేశం మెచ్చిన ఇద్దరు నేతలపై అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మండిపడుతున్నాయి. అలాగే ఎన్టీఆర్, పీవీ అభిమానులు సైతం ఎంఐఎం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు, సీట్ల రాజకీయాల కోసం ఇద్దరు మహనీయుల సమాధులను కూల్చి వేయాలనడం సరైంది కాదని అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు.