జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. పాలకమండలి గడువు మూడు నెలలు ఉండగానే ఎన్నికలు పూర్తికావడం 65 ఏళ్ల జీహెచ్ఎంసీ (పూర్వపు ఎంసీహెచ్) చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ముందే ఎన్నికలు జరిగినా..ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. 150 డివిజన్లలో 56 సీట్లు టీఆర్ఎస్ గెలవగా, 48 బీజేపీ, 44 ఎంఐఎం, 2 సీట్లు కాంగ్రెస్ గెలిచాయి. ఎక్స్ అఫిషియో ఓట్లను కలిపాక, మేయర్ ఎన్నికకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ని 98గా అధికారులు తేల్చారు. అయితే ఏ పార్టీకి మెజార్టీకి దక్కలేదు. టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తుల విషయంలో సందిగ్దత నెలకొంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అనేది ఇంకా తేలాలి. ఇక సైద్ధాంతిక పరంగా ప్రత్యర్థులైన బీజేపీ- ఎంఐఎం కలిసే ప్రశ్నే తలెత్తదనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ముందు మూడు ఆప్షన్లు, బీజేపీ ముందు ఒక ఆప్పన్ ఉన్నాయి.
టీఆర్ఎస్ ఆప్షన్లు ఇవీ..
ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తరువాతే మేయర్, ఉప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పటికి కార్పొరేటర్లతో పాటు 44 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు సైతం ఓటింగ్‌లో పాల్గొంటారు. టీఆర్ఎస్‌కి 31 మంది, ఎంఐఎంకు 10, భాజపాకు ఇద్దరు, కాంగ్రెస్‌కు ఒక ఎక్స్‌అఫిషియో లున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చినా..గరిష్టంగా మూడు స్థానాలు ఉంటాయి. వాటిని మినహాయిస్తే.. మొత్తం సంఖ్య 150+44 కలిపి 194 అవుతుంది. మేజిక్ ఫిగర్ 98 ఉంటే మేయర్ ఎన్నిక సులువు అవుతుంది. అయితే ఈ మేజిక్ ఫిగర్ మేయర్ ఎన్నికకు తప్పనిసరి కాదని, కేవలం సర్వసభ్య సమావేశం నిర్వహణకే అని 1956 చట్టం చెబుతోందని, ఈ ప్రకారం 98 మంది సభ్యులుంటేనే (కోరం) సమావేశం నిర్వహించాలి. అంటే 98 మంది సభకు హాజరైతే చాలు..మేయర్ ఎన్నికకు వెళ్లే అంశం కూడా తెరపైకి వస్తుంది. అప్పుడు పార్టీలు విప్‌ని జారీ చేస్తాయి. ఆ ప్రకారం ఎన్నిక ఉంటుంది. అంటే ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి టీఆర్‌ఎస్ బలం 87, ఎంఐఎంకు 54, బీజేపీకి 50, కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యులుంటారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ వేర్వేరుగా మేయర్ అభ్యర్థిని బరిలో నిలిపి, విప్ జారీ చేస్తే ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారు. అప్పుడు అత్యధికంగా టీఆర్ఎస్‌కే ఓటు వేస్తారు కాబట్టి వారికే పీఠం దక్కనుంది. ఆ ప్రకారం కూడా మేయర్ ఎన్నిక జరగవచ్చు. అయితే ఇది రాజకీయంగా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పాటించిన సంప్రదాయలను పాటించకుండా.. అధికారం కోసం టీఆర్ఎస్ ఇలా చేసిందని ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం ఉంది.
ఇక రెండవ ఆప్షన్ విషయానికి వస్తే..ఎంఐఎంతో డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకుంటే రానున్న కాలంలో విమర్శలు వస్తాయనుకుంటే.. బీజేపీ లేదా ఎంఐఎం నుంచి కొంత మందిని చేర్చుకునే అంశం కూడా చర్చకు వస్తోంది. బీజేపీ కార్పొరేటర్లను చేర్చుకుంటే ఆ పార్టీ రానున్నకాలంలో మరింత రచ్చచేయడం ఖాయంగా కనిపిస్తోంది. మూడో ఆప్షన్ విషయానికి వస్తే.. మేయర్ ఎన్నికకు కావాల్సిన సభ్యుల వరకు లోపాయకారీగాఎంఐఎం సభ్యులను అనధికారికంగా చేర్చుకునే అవకాశం కూడా టీఆర్ఎస్‌కు ఉంది. ఇక్కడ విప్ జారీ చేయడం పార్టీల నిర్ణయం మేరకు ఉంటుంది కాబట్టి.. ఆ వెసులుబాటు అస్త్రాన్ని టీఆర్ఎస్ వాడుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆప్షన్లపై పార్టీలో చర్చ నడుస్తున్నట్లు సమాచారం.
Must Read ;- పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్, ఎంఐఎం పడినట్టే..
బీజేపీకి ఆప్షన్ ఒక్కటే..
ఎంఐఎంతో పొత్తు లేదా ఎంఐఎం సభ్యులను తమ పార్టీలోకి తీసుకునే చర్చే పార్టీ చేయడం లేదని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వాళ్లని తమవైపు తిప్పుకోవడం మినహా వేరే ఆప్షన్ లేదు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అంతే కాకుండా..ఇతర పార్టీల కంటే తమ పార్టీ భిన్నమని చెప్పే బీజేపీ ఆ పని చేస్తే.. పార్టీ ఇమేజ్ కచ్చితంగా డామేజీ అవుతుంది.

ప్రత్యేక పాలన అంశం..
ఇక మేయర్ ఎంపికకు సంబంధించి నిర్ణయం జరగని పక్షంలో ప్రత్యేక అధికారుల పాలన అంశం తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన నడిచింది. అయితే పాలకవర్గం గడువు తీరాక, ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన నడిచింది. ఎన్నికలు జరిగినా మేయర్ ఎన్నిక సాధ్యం కాక ప్రత్యేక అధికారుల పాలన వస్తే ఇదే తొలిసారి (ఒకవేళ వస్తే) కానుంది. 1955లో ఏర్పాటైన ఎంసీహెచ్ లో 1974 వరకు ఎన్నికలు సాఫీగానే జరిగాయి. తరువాత 1986 వరకు ఎన్నికలు జరగలేదు. 12ఏళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలన నడిచింది. 1986లో ఎన్నికలు జరగ్గా.. పాలకవర్గం 1991వరకు ఉంది. అనంతరం 2002లోనే ఎన్నికల జరిగాయి. అంటే మరోసారి 11ఏళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉంది. మళ్లీ 2002లో ఎన్నికలు జరగ్గా..2007వరకు పాలకవర్గం కొనసాగింది. 2007లో ఎంసీహెచ్ శివార్లలోని 12 మున్సిపాల్టీలను విలీనం చేస్తూ జీహెచ్‌ఎంసీ ఏర్పాటైంది. 2009 వరకు ఈ ప్రక్రియ సాగింది. 2009 , 2016 లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10 తరువాతే మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పవచ్చు.
ఇక్కడే మరికొన్ని అంశాలూ తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పాలక మండలిని కొనసాగించాలా..వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం అవసరం అవుతుంది. చట్ట సవరణ ఉంటుందా, పాలవకర్గం పూర్తి కాలం కొనసాగుతుందా, మళ్లీ ఎన్నికలకు ఛాన్స్ ఉంటుందా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు











