మాజీ సీఎం చంద్రబాబునాయుడు మదనపల్లెకు వచ్చి.. పుంగనూరు దళిత యువకుడి మరణం విషయంలో తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. ఈ మేరకు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్ డిపివో) నుంచి చంద్రబాబుకు సిఆర్ పిసి 91 నోటీసులు మాజీ సిఎం చంద్రబాబుకు పంపారు. పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
ఓం ప్రతాప్ మృతిపై చంద్రబాబు గతంలోనే డిజిపి గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఆగస్ట్ 27 న దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని పోలీసులు నోటీసులో ప్రస్తావించారు. ‘‘మీ దగ్గర ఉన్న సమాచారం,సాక్ష్యాధారాలను అందజేయాలి’’ అని నోటీసులో చంద్రబాబును కోరుతూ మదనపల్లి ఎస్ డిపివో పేరుతో నోటీసులు సర్వ్ అయ్యాయి.
నోటీసు అందిన వారం రోజుల లోపు, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబాబుకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.
పెద్దిరెడ్డికి ముడిపెట్టినందుకే
పుంగనూరుకు చెందిన దళిత యువకుడు ఓంప్రతాప్ కొన్ని రోజుల కిందట మరణించాడు. మరణానికి కొన్ని రోజుల ముందు వైఎస్ జగన్ ను తిడుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే, ఆ వీడియో కారణంగా వైకాపా కార్యకర్తలు బెదిరించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబునాయుడు ఆరోపించారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యులని ఆరోపించారు. అయితే యువకుడి కుటుంబం మాత్రం.. అతనిది సహజమరణం అని పేర్కొంది. తెలుగుదేశం ఆరోపణల నేపథ్యంలో అతని మృతదేహాన్ని సమాధినుంచి వెలుపలికి తీసి.. పోస్టుమార్టం కూడా నిర్వహించారు. నివేదిక రావాల్సి ఉంది. ఈలోగా.. ఆరోపణలు చేసినందుకు గాను.. ఆ ఆరోపణ ఎలా చేయగలిగారో.. తన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటో పోలీసు స్టేషన్ కు వచ్చి ఇవ్వాలని చంద్రబాబుకు పోలీసులు నోటీసు పంపారు.











