కరోనా సమయంలో దీపావళి సంబురాలు పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు కాల్చటానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధాజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలుదారులు ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది.
చివరి దశకు ..
ఉత్తరాంధ్రలో అతిపెద్ద బాణాసంచా విక్రయ కేంద్రమైన విజయనగరంలో ఇప్పటికే క్రయవిక్రయాలు చివరిదశకు చేరుకున్నాయి. దీపావళికి నెల రోజుల ముందు నుంచే ఇక్కడ విక్రయాలు ప్రారంభమవుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి చిల్లర వర్తకులు ఇక్కడకు వచ్చి హోల్‌సేల్‌గా కొంటారు. వారు పల్లెల్లో దీపావళి ముందు రోజు రిటైల్ మార్కెట్లో అమ్ముకుంటారు. అందువల్ల ఈ నిషేధం ఉత్తర్వుల వల్ల హోల్‌సేల్ వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రిటైల్ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేసేస్తారు కాబట్టి వారికీ సమస్య లేదని స్థానికులు భావిస్తున్నారు.
నిషేధం మాటున..
రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినందున ఇదే అదనుగా చిల్లర వ్యాపారులు అమాంతం టపాసుల రేట్లు పెంచేసే అవకాశం ఉంది. దీపావళి రోజున రాత్రి 8 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం ఇచ్చినందున వినియోగదారులు ఎలాను కొనుగోలు చేస్తారు. సాధారణంగా టపాసులు కాల్చేందుకు రెండుగంటల సమయం చాలా ఎక్కువ. సాధారణ కుటుంబీకులు రెండు గంటల సమయం టపాసులు కాల్చాలి అంటే ప్రస్తుత ధరల్లో నాలుగువేల రూపాయలు వెచ్చించాలి. అంత వెచ్చించి వినియోగించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆషామాషీ విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అందువల్ల ఈ నిషేధం ఉత్తర్వుల వల్ల ప్రజలకు పెద్ద ప్రయోజనం లేదని సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నియంత్రణ దృష్ట్యా టపాసుల క్రయ విక్రయాలపై పూర్తి నిషేధం విధిస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.











