పంజాబ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. లుథియానాలోని తాజ్‌పూర్ రోడ్డులోని ఓ గుడిసెలో సభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు(దంపతులు సహా ఐదుగురు చిన్నారులు) సజీవ దహనమయ్యారు.తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేకపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో దంపతులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
కాగా ఇదే కుటుంబానికి చెందిన మరొక వ్యక్తి మాత్రం ప్రమాదంలో చిక్కుకోకుండా బయటపడ్డాడు.మృతి చెందిన దంపతుల మరో కుమారుడు రాజేశ్(17) ఆ సమయంలో వేరే ప్రాంతంలో నిద్రించడంతో అతడు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలినట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునేలోపే కుటుంబ సభ్యులు మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.ఇక అగ్ని ప్రమాదం ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.