మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 72 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తండ్రి పై తనకున్న ప్రేమాభిమానాలను శుభాకాంక్షల రూపంలో తెలిపారు.
‘జన్మనిచ్చేవారు, చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అనే చాణక్యుడు మాటల ప్రకారం చూస్తే చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు తండ్రి సమానులే అని లోకేష్ పేర్కొన్నారు.చంద్రబాబు దార్శనిక పాలనలో ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదవగలిగారని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఆయన కోట్లాదిమందికి అన్నదాత అయ్యారని తెలిపారు.
చంద్రబాబు అంటే ఒక భరోసా అని.. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం అని లోకేష్ అన్నారు. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్.. ఆయనే మా నాన్న చంద్రబాబు గారు. నాన్నగారూ, మీకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.